ఉధృతమవుతున్న న్యాయపోరు

C

– గన్‌పార్క్‌ వద్ద లాయర్ల దీక్ష

– గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

– సుప్రీం చీఫ్‌ జస్టిస్‌తో హైకోర్టు సీజే సమావేశం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ,జులై 2(జనంసాక్షి): హైకోర్టు విభజనకు సంభంధించి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. న్యాయాధికారులు, లాయర్ల సమ్మెతో ఏర్పడ్డ ప్రతిష్టంభన నేపథ్యంలో అటు హైకోర్టు, ఇటు కేంద్రం పావులు కదుపుతోంది. ఓ వైపు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దిలీప్‌ భోస్లే సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ను కలిశారు. అలాగే మరోమారు గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ భేటీ అయ్యారు. కేంద్రం సూచనల మేరకు ఈ వ్యవహారాలన్నీ చురకుగా సాగుతున్నాయి. మరోవైపు  ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు చేస్తోన్న దీక్ష ఉధృతంగా కొనసాగుతోంది. ఈమేరకు శనివారం లాయర్లు, జడ్జీలు తెలంగాణ అమరవీరుల స్థూపం గన్‌పార్క్‌ వద్ద మౌనదీక్ష చేపట్టారు. వీరి ఆందోళనకు రిటైర్డ్‌ న్యాయమూర్తులు కూడా సంఘీభావం ప్రకటించారు. అడ్వొకేట్‌ జేఏసీ నేతలు మాట్లాడుతూ.. కేంద్రం హైకోర్టు విభజన విషయంలో తాత్సారం చేస్తుండటంతో విధిలేక తాము ఆందోళనలు చేయాల్సి వస్తుందని తెలిపారు. హైకోర్టు విభజన జరిగే వరకు ఆందోళనను ఆపబోమని పేర్కొన్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  దిలీప్‌ బోస్లే నేడు కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉమ్మడి కోర్టు పరిధిలో జరుగుతున్న పరిణామాలను సుప్రీం సీజేకు జస్టిస్‌ డీబీ బోస్లే వివరించినట్లు సమాచారం. కాగా తెలంగాణ న్యాయవాదుల బృందం కూడా ఆదివారంసుప్రీంకోర్టు సీజేను కలవనుంది.మరోవైపు హైకోర్టు విభజన కోరుతూ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు మౌనదీక్షకు దిగారు. సస్పెండ్‌ చేసినవారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడ్వకేట్‌ జేఏసీ ఆందోళనకు రిటైర్డ్‌ జడ్జీలు మద్దతు తెలిపారు. గత్యంతరం లేకే సమ్మె చేస్తున్నట్లు.. హైకోర్టును విభజించే వరకు ఆందోళన కొనసాగుతది ఈ సందర్భంగా అడ్వకేట్‌ జేఏసీ స్పష్టంచేసింది. ఇక మరోమారు గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు విభజనపై గత కొంత కాలంగా తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు విబజనను తీవ్రంగా తీసుకున్న తెలంగాణ సర్కార్‌ అవసరమైతే సిఎం జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చిరంచారు. ఈ దశలో కేంద్ర న్యాయశౄఖ మంత్రి సదానంద గౌడ విభజనతో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇది విూరువిూరు చూసుకోవాలని అన్నారు. ఈ విషయంతో సెం కెసిఆర్‌ సీరియస్‌గానే దీనిపై స్పందించారు. లాయర్ల ఆందోళనకు టిఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు పలికింది. అలాగే రాజకీయ పార్టీలు, సంస్థలు కూడా మద్దతు పలికాయి. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ధర్నాలో అందరూ వచ్చి మద్దతు పలికారు. ఇక పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను జరుగనీయబోమని టిఆర్‌ఎస్‌ ఎంపిలు బాల్క సుమన్‌ తదితరులు హెచ్చరించారు. పరిస్థితి తీవ్రం కావడంతో కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ వెంటనే సిఎం కెసిఆర్‌తో చర్చించారు. పరిస్థితులపై ఆరా తీసారు. అలాగే చీఫ్‌ జస్టిస్‌ ఉన్నపళంగా ఢిల్లీ వెల్ళి సిజెను కలిశారు.