ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖుల

ప్రధాని మోడీ,సోనియా, మన్మోహన్‌ ఓటు
ఓటింగ్‌కు దూరంగగా ఉన్న టిఎంసి

న్యూఢల్లీి,ఆగస్ట్‌6( జనం సాక్షి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, మాజీప్రధాని మన్మోమన్‌ సింగ్‌, అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఆప్‌ నేత హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌, జైరాం రమేష్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌధరి, కే సురేష్‌ ఓటు వేశారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్‌ అల్వాలు పోటీపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనున్నది. 780 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అయితే 36 మంది తృణమూల్‌ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రాజ్యసభలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్దవ్‌ పార్టీలు మార్గరేట్‌ అల్వాకు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్‌ హౌజ్‌లో శనివారం ఉదయం ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మార్గరెట్‌ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్గరెట్‌ అల్వా (80) కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గతంలో రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్టాల్రకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జగదీప్‌ ధన్‌కర్‌ జాట్‌ నేత, సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్‌కు గైర్హాజరవాలని నిర్ణయించుకుంది. మార్గరెట్‌ అల్వాను ఎంపిక చేసేటపుడు తమను సంప్రదించలేదని ఆరోపించింది. ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తోంది. మార్గరెట్‌ అల్వాకు దాదాపు 200 ఓట్లు (26 శాతం) లభించే అవకాశం ఉంది. ఆమెకు కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, టిఆర్‌ఎస్‌, వామపక్షాలు మద్దతిస్తున్నాయి. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ఇదిలావుండగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసే విధానాన్ని వివరిస్తూ బీజేపీ శుక్రవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీల ఎంపీలు దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కొందరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, మరో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బీజేపీ నిర్వహించిన మాక్‌ ఓటింగ్‌ డ్రిల్‌ అనంతరం ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ పార్లమెంటుకు వచ్చారు. తనకు మద్దతిస్తున్నందుకు ఎన్డీయే ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు.