ఉపాధి అక్రమార్కుల నుంచి రికవరీకి ఆదేశాలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి20( జనంసాక్షి) : క్షేత్రసహాయకుల తప్పిదాల ఉపాధిహావిూలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీంతో దాదాపు 91,034 నిధుల దుర్వినియోగమైందని అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని అందుకు బాధ్యులైన క్షేత్రసహాయకుల నుంచి రికవరీ చేయాలని డ్వామా అదనపు పీడీ అంజయ్య ఆదేశించారు. క్షేత్రసిబ్బందితో సాయంత్రం ఆరు గంటల వరకు తనిఖీ వివరాలపై సవిూక్ష కొనసాగింది. కూలీలకు పూర్తిస్థాయిలో డబ్బులు సక్రమంగా అందలేదని పనులు ఒకరు చేస్తే కూలీ డబ్బులు వేరేవారికి ఇచ్చారని తనిఖీ సిబ్బంది వెల్లడించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలపై ఆయా శాఖల అధికారులు సమగ్రమైన నివేదిక రూపొందించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ఉపాధిహావిూ పనులపై పూర్తి స్థాయి అవగాహన కొరవడిందన్నారు. వెంటనే వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు సూచించారు. దిలావర్‌పూర్ మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలోని 23 గ్రామాల్లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో కొనసాగిన ఉపాధిహావిూ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీ విచారణ పూర్తయ్యింది. గ్రామాల వారీగా విచారణ అధికారులు తమ నివేదికను ఆ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో చదివి వినిపించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల్లో ఒకరికి బదులు మరొకరు విధులకు హాజరైనట్లు గుర్తించారు. కొందరికి సకాలంలో పని గుర్తింపు కార్డులు అందనందున అదే ఇంట్లోని వారికి అవకాశం కల్పించాల్సి వచ్చిందని క్షేత్ర సిబ్బంది సమాధానం చెప్పినా అధికారులు సంతృప్తి చెందలేదు. రాంపూర్‌లో పనిచేస్తున్న మెట్లు కూలీల హాజరు శాతాన్ని సరిగ్గా నమోదు చేయకపోవడంతో కూలీ భత్యాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడినట్లు తనిఖీలో వెల్లడైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.



