ఉపాధి పనులపై కూలీల అనాసక్తి

సకాలంలో డబ్బులు రావనే ఆరోపణలు
క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం
హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గ్రావిూణ ఉపాధి హావిూ పథకం అమలు  అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదు. చేతినిండా పని కొందరికే లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సకాలంలో కూలీ డబ్బు అందని కారణంగా కూలీలు ఈ పథకంలో పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. తాజాగా సిఎం కెసిఆర్‌ గ్రామస్థాయిలో పనులకు ఉపాధి పథకాన్ని జోడించాలని నిర్ణయించారు. దీంతో పరిస్థితుల్లో మార్పులు రాగలవని అంటున్నారు. ఉపాధిహావిూ పథకం కింద చేపట్టే పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పథకం అమలులో భాగంగా చేపట్టిన  వ్యవసాయ రహదారులు, బావులు, ఇంకుడుగుంతలు, మట్టికట్టలు, బావుల పూడికతీత, నాడేపు కంపోస్టు, వర్మీ కంపోస్టు నిర్మాణాలు తదితరాల్లో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయి. గతేడాదితో పోల్చుకుంటే పనులకు హాజరమ్యే కూలీ సంఖ్య బాగా తగ్గింది. కూలీ గిట్టుబాటుగా లేకపోవడం, వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటం, పనులు అనుకూలంగా లేకపోవడం తదితర కారణాల వల్ల పనిచేయడానికి ముందుకురాని పరిస్థితి నెలకొంది. దీనికితోడూ చాలామంది పట్టణాలకు వలస వెళుతున్నారు. కూలీ గిట్టుబాటు కాక పట్ఠణాల్లో పనులు వెతుక్కుంటున్నారు. ఈ  పథకం కింద పనులకు వచ్చే కూలీలకు కనీసం వంద రోజులు ఉపాధి పని చూపించాల్సిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. మాటిమాటికి మారుతున్న నిబంధనల కారణంగా వేతనాల చెల్లింపుల్లో జాప్యం కావడం, ఉపాధి హావిూ పనులు చేపట్టే కూలీలకు గిట్టుబాటు కాకపోవడంతో ఆశించిన సంఖ్యలో కూలీలు హాజరుకావడం లేదు. దీంతో వందరోజుల ఉపాధి కొందరికే పరిమితమైంది.మొదట్లో అనేక మంది కూలీలు హాజరయ్యేవారు. వేతనాలు చెల్లింపులో జాప్యం, పనుల్లో పారదర్శకత, బిల్లుల చెల్లింపులో అక్రమాలను అడ్డుకట్ట వేయడం వల్ల పనులు అవసరం ఉన్న కూలీలు మాత్రమే వస్తున్నారు. చేసిన పనికి కూలి డబ్బులు ఆలస్యంగా రావడం, చేతికందుతున్న కూలి డబ్బులు తక్కువగా ఉండటం కూడా కూలీల పనుల అనాసక్తికి దారి తీస్తోంది. వేతనాల్లో చెల్లింపులో తరచూ నిబంధనలు మారడంతో పనిచేసిన కూలి డబ్బులు వస్తాయో రావోనని చాలా మంది ఆసక్తి చూపక పోవడానికి కారణమవుతోంది. గతేడాది చేసిన పనులకు సంబంధించి డబ్బులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5 శాతం కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం చేపట్టే పనులకు సాంకేతిక పద్ధతులు తోడు కావడంతో పనులు పకడ్బందీగా చేయాల్సి వస్తోంది. దీంతో కూలీల సంఖ్య తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూలీలు ఉపాధి పనులపై అనాసక్తిని చూపుతుండటం క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం తప్ప మరోటి కాదనే విమర్శలు ఉన్నాయి.  అర్హులైన ప్రతి కూలీకి వందరోజుల పని కల్పించేలా చూస్తున్నామని అధికారులు  అన్నారు. ఉపాధి హావిూ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందరోజుల పని పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.