ఉపాధి హామీ పరిహారం పెంపు పట్ల హర్షం: ధనుంజయ నాయుడు

గరిడేపల్లి, సెప్టెంబర్ 7 (జనం సాక్షి):ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రమాదవశాత్తు ఏవైనా జరిగితే ఇచ్చే నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల చేయడం పట్ల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు హర్షం ప్రకటించారు. బుధవారం  ఆయన గరిడేపల్లి లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు వైద్య సదుపాయాల కొరకు ప్రమాదం బారిన పడితే ఇచ్చే పరిహారం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఎవరైనా ఉపాధి పనులు చేస్తూ గాయపడి శాశ్వత వైకల్యానికి  గురైతే గతంలో 25 వేల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చే వారని ఇప్పుడు ఆ పరిహారాన్ని లక్ష రూపాయలు పెంచడం సంతోషకరమని పని ప్రదేశంలో పక్షవాతాన్ని గురి అయితే 50 వేలు ఇచ్చే పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారని పనిచేసే చోట తల్లిదండ్రులతో  పాటు వెంట వచ్చే  ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ప్రమాద వశాత్తు శాశ్వత అంగవైకల్యానికి  గురైతే ఇచ్చే పరిహారాలు 25వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారని దురదృష్టవశాత్తు పనిచేసే చోట పిల్లలు గానీ పెద్దలు కానీ మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని 50 వేల నుంచి రెండు లక్షలకు పెంచారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు  పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా సమితి పక్షాన ధనుంజయ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఎంతో కాలంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున  చేస్తున్న ఇంకా అనేకమైన డిమాండ్స్ అపరిస్కృతంగా ఉన్నాయని వాటి పట్ల కూడా ప్రభుత్వ ఉదాసీన వైఖరితో పరిశీలించాలని రాష్ట్రంలో నివాస గృహం లేని వ్యవసాయ కార్మికులను గుర్తించి వారికి ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని ఆయన కోరారు.
 ఆయన వెంట గరిడేపల్లి మండలం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సైదులు, తిరపయ్య ఉన్నారు.