ఉప ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపు

అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా

సంకీర్ణ సర్కార్‌ ప్రతిష్టకు సవాల్‌ కానున్న ఫలితాలు

బెంగళూరు,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి

ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది. వీటి లెక్కింపు మంగళవారం జరుగనుంది. దీంతో అభ్‌య్థుల్లో టెన్షన్‌ మొదలయ్యింది. గెలుపు మాదంటే మాదని అన్ని పార్టీల వారు అంటునప్పటికీ, అందరూ ఈవీఎంల వైపు చూస్తున్నారు. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ నేతలు గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్‌తోపాటు ఎగ్జిట్‌పోల్స్‌ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. సంకీర్ణ పార్టీలకే ప్రజలు మద్దతు ఇచ్చారని పోల్స్‌ ప్రకటించాయి. దీంతో భవిష్యత్తును ఎలా మలచుకోవాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సమాలోచనలు చేస్తుండగా ఫలితాలు తారుమారైతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే కోణంలో బీజేపీ చర్చిస్తోంది. ఫలితాలు బీజేపీవైపు వస్తే ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేయాలని ఆలోచిస్తున్నారు. ఫలితాలు సంకీర్ణంవైపే ఉంటే వారి మైత్రి మరింత పటిష్టం కానుందని చెప్పవచ్చు. మండ్య లోక్‌సభ, రామనగర్‌ శాసనసభ స్థానాలు జేడీఎస్‌కు దక్కినట్టే అని చెప్పవచ్చు. మిగిలిన మూడు స్థానాలకోసమే చర్చలు సాగుతున్నాయి. మండ్య లోక్‌సభ పరిధిలో 8 మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉండడం, చివరిక్షణం దాకా బీజేపీ టికెట్‌ ఖరారు చేయకుండా డా.సిద్దరామయ్యకు కేటాయించడం వలన అక్కడ బీజేపీ ఆదిలోనే వెనుకంజ వేసింది. బళ్ళారి, శివమొగ్గలో గెలుపు మాదంటే మాదని బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటములు సవాళ్ళు విసురుతున్నాయి. అందుకు అనుగుణంగానే బెట్టింగ్‌లు రెండు నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. బళ్ళారి స్థానం గెలుపుపై అటు స్థానికంగానే కాకుండా బెంగళూరులోనూ బెట్టింగ్‌లజోరు కనిపిస్తోంది. మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ, ఉపసమరం ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి కానున్నాయన్నారు. మరోవైపు మంగళవారం జరిపే కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. మూడు లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ సంబంధిత జిల్లా కేంద్రాలలో జరుపుతుండగా రామనగర్‌, జమఖండి నియోజకవర్గాల కౌంటింగ్‌ అక్కడే నిర్వహిస్తున్నారు. ఈవీఎంలను ఉంచిన స్టాం/-రగ్‌ రూంల వద్ద కేంద్ర భద్రతా బలగాలను మొహరించారు. ఫలితాలకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. బళ్లారి లోక్‌సభ ఉప ఎన్నికలలో భాగంగా శనివారం ఓటింగ్‌ పక్రియ ముగియండంతో ఈవీఎంలను బళ్లారి నగరంలోని ఆర్‌వైఎంఈసీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు జిల్లాఎన్నికల అధికారి, జిల్లాధికారి డా.రామ్‌ప్రసాత్‌ మనోహర్‌ తెలిపారు. అంతవరకు బళ్లారి లోకసభ పరిధిలోని ఎనిమిది తాలుకాల ఈవీఎంలను నియోజకవర్గాల వారిగా వేర్వేరుగా ప్రత్యేకంగా స్టాం/-రగ్‌రూంలలో భద్రపరిచి, అభ్యర్థుల పరంగా ఎన్నికల ఏజెంట్ల(ప్రతినిధుల) సమక్షంలో గదులకు తాళంవేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి భద్రతా చర్యలను జిల్లాఎన్నికల అధికారులు పరిశీలించారు. కంప్లి నియోజకవర్గంలో అత్యధికంగా, బళ్లారిసిటీలో అత్యల్పంగా పోలింగ్‌ జరిగినట్లు జిల్లాధికారి తెలిపారు. తీవ్ర కుతూహలం కలిగించిన ఉపఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు మాదే అంటున్నా, అసలు రహస్యం ఈవీఎంలు తెరిస్తే గానీ తెలియదు. వాటిని భారీ బందోబస్తు నడుమ భద్రపరచారు. ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అంతిమంగా ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రముఖ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు.