ఉభయసభల్లో ఆందోళనల పర్వం

– గాంధీకుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్‌ ఆందోళన
– మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌
– వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలుచేసిన కాంగ్రెస్‌ సభ్యులు
– పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలను కొనసాగించిన స్పీకర్‌
– సభనుంచి వాకౌంట్‌ చేసిన కాంగ్రెస్‌ సభ్యులు
– రాజ్యసభలోనూ గందరగోళం.. సభ వాయిదా
న్యూఢిల్లీ, నవంబర్‌19 (జనంసాక్షి):  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ప్రారంభం కాగానే జేఎన్‌యూ వివాదంపై విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కూడా కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. గాంధీ కుటుంబానికి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ భద్రతను తొలగించడంపై ప్రధాని మోదీ, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని లోక్‌ సభలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే… అమిత్‌ షా లోక్‌ సభ నుంచి రాజ్యసభకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీలు లోక్‌ సభలో వెల్‌ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. సభ్యులంతా తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. రైతుల సమస్యపై ఈరోజు చర్చ ఉందని ఇలాంటి కీలక సమస్యపై చర్చించడానికి విూరు ఆసక్తిని కనబరచకపోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
అయినా స్పీకర్‌ మాటలను కాంగ్రెస్‌, ఎన్సీ ఎంపీలు పట్టించుకోలేదు. కక్ష సాధింపు రాజకీయాలను ఆపండి, నియంతృత్వ పోకడలకు ముగింపు పలకండి, వీ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. వీటిని పట్టించుకోని స్పీకర్‌ మరో అంశాన్ని చర్చకు స్వీకరించారు. దీంతో, వీరంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకు ముందు గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భద్రతను ఎత్తివేయడాన్ని లోక్‌సభలో ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరీ ప్రశ్నించారు. గాంధీ కుటుంబీకులు సాధారణ వ్యక్తులేవిూ కాదన్నారు. ఎందుకు అకస్మాత్తుగా గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భద్రతను తొలగించారని అధిర్‌ అడిగారు. భద్రతను ఉపసంహరించాల్సిన అవసరం ఏమివచ్చిందన్నారు. గాంధీ ఫ్యామిలీకి మాజీ ప్రధాని వాజ్‌పేయి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు ద్వారా భద్రత కల్పించారని అధిర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1991 నుంచి 2019 వరకు రెండుసార్లు ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ సమయంలో ఎప్పుడూ ఎస్పీజీ భద్రతను తొలగించలేదన్నారు. మరిప్పుడెందుకు తొలగించారని ఆయన అడిగారు. ఎస్పీజీ భద్రత తొలగింపుపై ప్రధాని మోదీ, ¬ంమంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. మంగళవారం ఒంటరిగానే పార్లమెంట్‌కు వచ్చారు. ఆమెతో పాటు కారులో వచ్చిన సీఆర్‌పీఎఫ్‌ జవానును ఒకటో నెంబర్‌ గేటు వద్దే ఆపేశారు. సోనియా, ప్రియాంకా, రాహుల్‌ గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించిన తర్వాత సీఆర్‌పీఎఫ్‌ దళాలు వారికి సెక్యూర్టీని కల్పిస్తున్నాయి.  ప్రభుత్వ స్పందించకపోవడంతో.. సుమారు 20 మంది కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేతలు మొదట వెల్‌లోకి దూసుకువెళ్లారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్‌ చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు.