ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌లో పోటీ
అన్ని నియోజకవర్గాల్లో నలుగురైదుగురు ఆశావహులు
నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి టిక్కట్ ఖాయమంటున్న నేతలు
ఆదిలాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పక్రియ తుదిశకు చేరుకుంది. పొత్తుల విషయంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒక సీటు మాత్రమే మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం ఉంది. బెల్లంపల్లి నుంచి గతంలో సిపిఐ నేత గుండా మల్లేశ్ ఎన్నికయ్యారు. ఇప్పుడదే వారికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టిజెఎస్,టిడిపిలకు ఇక్కడ సీట్లు దక్కే అవకాశాలు లేనట్లుగానే ఉంది. దీంతో ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో భరోసా ఏర్పడింది. పోరాడితే తమదే టిక్కెట్ అన్న రీతిలో ప్రచారంలో ఇప్పటికే దూసుకుని పోతున్నారు. అయినా ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది.పోటీపడుతున్న నాయకుల్లో వరుసగా మూడుసార్లు ఓడిపోయినవారు గానీ, 30వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినవారు గానీ, ఎన్నికల్లో 25వేల కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారి దరఖాస్తులను పక్కనబెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీ పడుతున్న నాయకుల్లో కొంత ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ మార్గదర్శకాల్లో వరుసగా మూడు ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే.. ఉమ్మడి జిల్లాలో ఆయా కేటగిరీల్లోకి వచ్చేవారెవరూ లేరు. మూడు ఎన్నికల్లో ఏదో ఒక ఎన్నికలో 30వేల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన కేటగిరీలో ఇద్దరు, 25వేల కన్నా తక్కువ ఓట్లు సాధించిన కేటగిరీలో ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం. అయితే వరుసగా మూడు ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అందరూ అర్హులే. ప్రస్తుతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్నవారిలో మంచిర్యాలలో ప్రేంసాగర్‌రావుతో పాటు ఆయన భార్య సురేఖ, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పేర్లను పరిగణించే అవకాశాలు ఉన్నాయి. బెల్లంపల్లిలో చిలుముల శంకర్‌తో పాటు పార్టీ
లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపల్లి ఉదయ్‌కాంత్‌తో పాటు ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్యకిరణ్ సైతం సీటు ఆశిస్తున్నారు. చెన్నూర్‌లో గ్రూప్1 అధికారిగా రాజీనామా చేసి వచ్చిన బోర్లకుంట వెంకటేశ్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, దుర్గం అశోక్ పోటీపడుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు ఒక్కరే ఉండగా, నిర్మల్‌లో సైతం పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మాత్రమే పోటీలో ఉన్నారు. సిర్పూర్‌లో పాల్వాయి హరీష్‌బాబు, రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్ టికెట్టు రేసులో ఉన్నారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, భార్గవ్ దేశ్‌పాండే, గండ్రత్ సుజాతతో పాటు మైనారిటీ నేత సాజిద్‌ఖాన్, సంజయ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బోథ్‌లో అనిల్ జాదవ్‌తో పాటు సోయం బాపూరావు, మరోనేత కుమ్రం కోటేష్ పోటీలో ఉన్నారు. ఖానాపూర్‌లో టికెట్టు ఆశిస్తున్న నేతల సంఖ్య చాలా ఎక్కువ. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, హరినాయక్ , భరత్ చౌహాన్, కొట్నాక్ రమేష్ తదితర పది మంది వరకు కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. ముధోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, రామారావు పటేల్, విజయ్‌కుమార్‌రెడ్డి సీటు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరు టిక్కెట్ సాధిస్తారన్నది చూడాలి. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ చేసిన అభ్యర్థులలో ఒకరు మినహా అందరూ విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఆసిఫాబాద్ సీటును అప్పట్లో సీపీఐకి కేటాయించడంతో అక్కడ టీడీపీ విజయం సాధించింది. మిగతా అన్ని సీట్లలో టీఆర్‌ఎస్‌తో కలిసి కాంగ్రెస్ విజయం గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప 2009 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో బీఎస్పీ నుంచి ఇద్దరు నేతలు పోటీ చేసి విజయం సాధించి, ప్రస్తుతం టీఆర్‌ఎస్ సభ్యులుగా మిగిలిపోయారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా లక్సెట్టిపేట నుంచి పోటీ చేసిన నడిపెల్లి దివాకర్‌రావు 2009లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం అరవింద్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో అరవింద్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా… చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దివాకర్‌రావు 50వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాల్లో ఒక్క ముధోల్ మాత్రమే కాంగ్రెస్ హస్తగతమైంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన జి.విఠల్‌రెడ్డి ఆ వెంటనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు విఠల్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కాం గ్రెస్ తరుపున పోటీచేసిన కె.ప్రేంసాగర్‌రావు ఓడిపోయిన వెంటనే తన స్థానాన్ని మంచిర్యాలకు మార్చుకున్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్‌లలో వరుసగా మూడుసార్లు ఓడినవారు గానీ, 25వేల లోపు ఓట్లు వచ్చినవారు గానీ ఎవరూ లేరు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి 2004లో గెలిచి, 2009లో మహాకూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2014లో మరోసారి స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. చెన్నూర్‌లో 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన గడ్డం వినోద్ 2009లో టీఆర్‌ఎస్ చేతిలో పరాజయం పొందారు. 2014లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిన వినోద్ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం 2009లోనే ఏర్పాటు కాగా, చిలుముల శంకర్ 2009లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో పొత్తులో సీపీఐకి కేటాయించడంతో రెబల్‌గా పోటీచేసి తరువాత విరమించుకున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న నాయకులంతా అర్హులే.