ఉమ్మడి కరీంనగర్‌లో పట్టు నిలుపుకున్న టిఆర్‌ఎస్
గతంలో కన్నా మరో సీటు కోల్పోయినా పట్టు బిగింపు
13 సీట్లలో 11 సీట్లు గెలుపు
జగిత్యాలలో అనూహ్య గెలుపు
కరీంనగర్,డిసెంబర్11
రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస జోరు కొనసాగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాల్లో తాజా ఫలితాల్లో 11 చోట్ల విజయభేరీ మోగించింది. ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించగా.. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మంథనిలో మాజీ కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గెలిచారు. ఇక రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ గెలుపొందారు. అయితే చందర్ టిఆర్‌ఎస్ టిక్కెట్ దక్కక పోవడంతో ఇండిపెండెంట్గా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో తెరాస 12 స్థానాలు దక్కించుకుని ఒకే ఒక్క నియోజకవర్గాన్ని కోల్పోగా.. ఈసారి మాత్రం రెండు స్థానాలు తెరాస చేజారాయి. గతంలో కోల్పోయిన జగిత్యాలను మాత్రం టిఆర్‌ఎస్ గెల్చుకుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మరోసారి విజయం
సాధించారు. తన సవిూప కాంగ్రెస్ అభ్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్ జయకేతనం ఎగురవేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈటలకు పోటిగా ప్రజాకూటమి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డిని కాంగ్రస్ తరఫున బరిలోకి దించారు. అయితే ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన ఈటల రాజేందర్ 40వేల ఓట్లకు పైచిలుకు మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వేములవాడ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలుపొందారు. తొలుత రమేష్ బాబుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చింది. అయితే తెరాస అధిష్ఠానం జోక్యంతో ఈ వివాదాలు సద్దుమణిగాయి. ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ బరిలోకి దిగగా ఓటమి పాలయ్యారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నియోజకవర్గంగా నిలిచిన జగిత్యాలలో తెరాస గెలుపు జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో కరీంనగర్ మొత్తంలో ఈ ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఈసారి తెరాస దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముమ్మర ప్రచారం సాగించింది. ఫలితంగా జగిత్యాలలో ఆరుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డి ఈసారి ఓటమిపాలయ్యారు. తెరాస అభ్యర్థి సంజయ్‌కుమార్ జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విజయం సాధించారు. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ స్థానం సీపీఐకి వెళ్లింది. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఇక్కడ్నుంచి బరిలోకి దిగినా ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విజయం సాధించారు. ఇక్కడ ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ తరఫున జువ్వాడి నర్సింగారావు బరిలోకి దిగారు. కరీంనగర్ నియోజకర్గంలో తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం సాధించారు. ఈ స్థానంలో ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగినా విజయం సాధించలేదు. భాజపా నుంచి బండి సంజయ్ రెండోస్థానంలో నిలిచారు. తాజా ఎన్నికల్లోనూ బండి సంజయ్ బరిలోకి దిగినప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా పొన్నం, గంగుల మధ్యే సాగింది. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌పై కొప్పుల ఈశ్వర్ మరోసారి పైచేయి సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ మహాకూటమి తరఫున కాంగ్రెస్ నుంచి చింతకుంట విజయ రమణారావు బరిలోకి దిగారు. భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి
పోటీ చేశారు. ఈ ముక్కోణపు పోటీలో దాసరి మనోహర్‌రెడ్డిని మరోసారి విజయం వరించింది.
చొప్పదండి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను కాదని సుంకె రవిశంకర్‌కు తెరాస టికెట్ ఇచ్చింది. దీంతో తెరాసను వీడిన శోభ భాజపాలో చేరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తెరాసపై అసమ్మతి ఎదురవుతుందని భావించారు. మరోవైపు ప్రజాకూటమి నుంచి మేడిపల్లి సత్యం బరిలోకి దిగారు. సత్యం ఇటీవలే తెదేపా నుంచి కాంగ్రెస్‌ను చేరారు. అయినప్పటికీ విజయం తెరాసనే వరించింది. తాజా ఫలితాల్లో మేడిపల్లి సత్యంపై రవిశంకర్ 42వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మానకొండూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌పై ప్రజాకూటమి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బరిలోకి దిగగా రసమయి విజయం సాధించారు. రామగుండం నియోజకవర్గం లో తెరాసకు షాక్ తగిలింది. ఇక్కడ తెరాస అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరకంటి చందర్ పటేల్ 20వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. చందర్ గతంలో తెరాసలో ఉన్నారు. అయితే తాజా ఎన్నికల్లో చందర్‌కు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన ఆయన
ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు.