ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వానలు

మత్తడి దుంకుతున్న పాకాల చెరువు

వరంగల్‌,జూలై15(జనంసాక్షి):ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. మేఘావృతంగా ఉండి ముసురు కురుస్తున్నా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వచ్చారు. ఆరు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. జిల్లాలో అతి పెద్దదయిన ఖానాపూర్‌ మండలంలోని పాకాల చెరువు 30అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి పోసింది. దుగ్గొండి మండలంలోని గుండం చెరువు, చెన్నారావుపేటలోని ముత్తడి చెరువు, నర్సంపేటలోని మాధన్నపేట చెరువు, నల్లబెల్లిలో రంగాయ చెరువు మత్తడి పోస్తున్నాయి. వర్షాలతో నగరంలో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా వరదనీరు సాఫీగా వెళ్లేలా బల్దియా అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు కొంటూ దుక్కులు దున్నుతున్నారు. పాకాల సరస్సు పరవళ్లు తొక్కుతూ మత్తడి పడుతూ కనువిందు చేసింది. 30.2 అడుగుల గరిష్ట నీటి సామర్థ్యం గల పాకాల సరస్సు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరస్సు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతుం డడంతో ఆయకుట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. జూలై రెండో వారంలోనే సరస్సు మత్తడి పడడం ఇదే మొదటి సారని రైతులు తెలిపారు. ఆయకట్టు రైతులు పాకాల మత్తడిని చూసి ఆనందంతో పరవశించిపోతున్నారు. నర్సనంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాకాల సరస్సులో మత్తడి వద్ద పసుపు, కుంకుమ వేసి పూజలు నిర్వహించారు.