ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ
చెరువుల్లోకి పూర్తిస్థాయి నీరు
పెరగనున్న పంటదిగుబడులు
ఆదిలాబాద్,ఆగస్ట్30(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి.జిల్లాలోని 453 చెరువులు ఉండగా.. అన్ని పూర్తిగా నిండిపోయి మత్తడి దూకుతున్నాయి. కొంతకాలంగా దోబూచులాడిన మేఘాలు ఎట్టకేలకు వర్షించడంతో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగాయి. చెరువులు, వాగులు, వంకలు నీటితో పొంగి పొర్లాయి. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. చెరువులు నిండటంతో వరదనీరు పొంగిపొర్లుతోంది. పంటలకు అనుకూలంగా వర్షాలు కురియ డంతో ఈ ఏడు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పెరిగాయి. సాత్నాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెరిగింది. మత్తడి వాగు ప్రాజెక్టు నీటి కూడా పెరిగింది. సరైన సమయంలో వర్షం పడడంతో పంటలకు జీవం పోసినట్లయిందని ఓ వైపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా, తాజా ఇన్‌ఫ్లోతో వరదగేటు ద్వారా గోదావరికి నీటిని విడుదల చేసారు. జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు కావడంతో సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. జైనథ్ మండలం సాత్నాలో ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 286.50 విూటర్లు కాగా.. ప్రస్తుతం 277 విూటర్ల నీటమట్టం ఉంది. తాంసి మండలం మత్తడివాగు 277.50 విూటర్లు కాగా 276 విూటర్ల వరకు అధికారులు నీటిని నిల్వ చేశారు. సీజన్ ప్రారంభం నుంచి వానలు పంటల సాగుకు అనుకూలి స్తుండగా.. ఈ నెల 16న కురిసిన భారీ వర్షం కారణంగా పలు మండలాల్లో రైతులు పత్తి, సోయాబీన్, కంది పంటలను నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 1.23 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు
ప్రాథమిక అంచనా వేయగా.. రెవెన్యూ, వ్యవసాయశాఖ బృందాల్లో గ్రామాల్లో పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో లెక్కిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూములు ఉండడంతో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. సాగునీటి వనరుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు యాసంగి పంటలకు సైతం ఎక్కువ మొత్తంలో సాగుచేసుకోవచ్చని వారు అంటున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాల్లోని తాగునీటి వనరుల్లో సైతం నీరు పుష్కలంగా చేరింది.
——————