ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సైన్స్ సెంటర్లు
హైదరాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ. 166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సైన్స్ వ్యాప్తి కోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రూ.8.56 లక్షల వ్యయంతో బీసీ గురుకుల పాఠశాలల్లో 20 కిచెన్ వేస్ట్ ఆధారిత బయో గ్యాస్ ఎ/-లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రేడియేషన్ టెక్నాలజీ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2018 జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ 105వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ సమావేశంలో 30 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తదితరులు పాల్గొన్నారు.