ఉర్జిత్‌ పటేల్‌ను సాగనంపే ప్రయత్నంలో మోడీ

ట్వీట్‌ ద్వారా విమర్శలు చేసిన చిదంబరం

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కథే పునరావృతం అవుతోందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మధ్య ఇటీవల విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. తాజాగా ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మరోసారి ఆయన ధ్వజమెత్తారు. ‘ఉర్జిత్‌ పటేల్‌ను ఆర్‌బీఐ నుంచి పంపించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కోరుకుంటోంది. దానర్థం మోదీ ప్రభుత్వం కూడా ఆయన వెళ్లిపోవాలనే భావిస్తోంది. రఘురాం రాజన్‌ కథే పునరావృతం అవుతోంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్మన్‌ జానెత్‌ యెల్లెన్‌ ఇటీవలే ఓ మాట చెప్పారు. ‘ప్రజలు ఎంతో నమ్మకం ఉంచిన సంస్థల చట్టబద్ధత, స్థాయిని దూరం చేయడం అంతిమంగా సామాజిక, ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. భారత్‌లో ఇది నిజం అనిపిస్తోంది’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లేదంటే ఆయన రాజీనామా చేయడమే ఉత్తమమని ఇటీవల స్వదేశీ జాగరన్‌ మంచ్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.