ఉల్లిధరలపై పట్టింపు లేని ప్రభుత్వాలు

ధరలు దాడి చేస్తున్నా తగ్గించే ప్రయత్నాలు మృగ్యం
వర్షాలతో బాగా దెబ్బతిన్న రైతులు
న్యూఢిల్లీ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : ఉల్లి ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మానేశాయి. ధరలు పెరుగుతున్నా వాటిపై దృష్టి సారించడం లేదు. దీంతో పక్షం రోజుల్లోనే ఉల్లి దరలు మూడింతలు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180 వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది అదే పునరావృతం కానుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉల్లి ధరల గురించి కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.  తమిళనాడులో కిలో ధర రూ. 120 నుంచి రూ. 130 వరకు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ సగటున ఉల్లి ధర దేశంలో కిలో రూ. 55.60 ఉన్నదని, ఢిల్లీలో రూ.50 ఉన్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబరు 20వ తేదీన ఉల్లి ధరలతో పోలిస్తే అదే రోజున ఈ ఏడాది 12.61 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం చెప్పినదాన్ని బట్టి ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నది ప్రభుత్వ ప్రకటన సారంగా చెప్పుకోవాలి. ఉల్లి, పప్పుధాన్యాలు, ఖాద్య తైలాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, బంగాళా దుంపల నిల్వలకు సంబంధించి ఎలాంటి పరిమితులు ఉండవు, ఎన్నయినా చేసుకోవచ్చని తాజా చట్ట సవరణ తెలిపింది. అయితే పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులకు ప్రోత్సాహం లేకపోవడంతో పంటలకు రైతులు ఆసక్తి చూపడం లేదు. మన దేశంలో ఉల్లి ఏడాదికి మూడు పంటలు పండుతుంది. వేసవి పంట ఏప్రిల్‌లో, ఖరీఫ్‌ తొలి పంట సెప్టెంబరు, ఖరీఫ్‌ రెండవ పంట నవంబరు తరువాత మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు, వాటితో వచ్చే తెగుళ్ల కారణంగా కొంత పంట నష్టం జరిగిందని, పది శాతం ఉల్లి విత్తనాల కొరత, రబీ పంటలో నిల్వ చేసినదానిలో 35 శాతం పాడైపోవటం ప్రస్తుత ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. ఉల్లి వ్యాపారం మొత్తం ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంది. గత ఏడాది ధరలు పెరిగడంతో వారు దీనిని సొమ్ము చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడనుందని చెప్పడం ద్వారా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించటం స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తు చర్యగా సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వ చేసిన ఉల్లిని విడుదల చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరింతగా విడుదల ఉంటుంది. డిసెంబరు 15 వరకు దిగుమతులను సులభతరం చేస్తూ 2003 నాటి ఉత్తరువులను కేంద్ర ప్రభుత్వం సడలించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరకుతో వచ్చే తెగులు, ఇతర వాటి నివారణకు దిగుమతి చేసుకొనే ఉల్లిని శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలను…ఓడలకు ఎక్కించే చోట గాకుండా మన దేశంలో దిగుమతి చేసే చోట చేపట్టేందుకు కూడా సవరణలు చేసింది. ఇది సక్రమంగా జరగకపోతే కొత్త సమస్యలు తలెత్తవచ్చు. మనం పది శాతం ఎగుమతులు చేస్తున్నాము. ధరలు పెరిగినపుడు నిషేధిస్తున్నాము. గత నాలుగు దశాబ్దాలుగా తరచూ ఉల్లి రాజకీయాలు ముందుకు వస్తున్నాయి. 1980 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేత ఇందిరా గాంధీ ఉల్లిని ఎన్నికల సమస్యగా ముందుకు తెచ్చారు. తరువాత కూడా ఎన్నికల సమయంలోనూ తరువాత ప్రతిపక్షాల అస్త్రంగా మారింది.1998లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉల్లి ధరల కారణంగానే ఓడిపోయిందని విశ్లేషించారు. తరువాత కాలంలో ఎవరు అధికారంలో ఉన్నా ఉల్లి ధరలు
చర్చకు వస్తూనే ఉన్నారు.  అయితే చాలావరకు పంట నష్టపోవడంతో ఉల్లి దిగుబడిపై ఎఫెక్ట్‌ పడింది. ఒక వైపు వినియోగదారులు కొనుక్కునేందుకు ఇబ్బందులు పడుతుంటే..  పంట అమ్ముకునే రైతుకు ఫలితం దక్కడం లేదని, దళారులే బాగుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.