ఉస్మానియా యూనివర్సిటీ తనకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను ….. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

సికింద్రాబాద్   (   జనం సాక్షి )     ఉస్మానియా యూనివర్సిటీ తనకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష సెంటర్లను  ఆయన పర్యవేక్షించారు. ప్రిలిమినరీ  పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా కండక్ట్ అవుతుందో తెలుసుకునేందుకు  ఓయూకు వచ్చినట్లు సీపీ  తెలిపారు. 1989 లో తాను ఆర్ట్స్ కళాశాలలో ఎంఎ ఎకనామిక్స్ చదివానని తనకు ఇక్కడే గోల్డ్ మెడల్ వచ్చిందని ఆ వెంటనే సివిల్ సర్వీసెస్ లో ఐపీఎస్ కూడా వచ్చిందని తన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అప్పట్లో  చదువు చెప్పిన గురువులను ఆయన గుర్తు చేశారు. పేద వారిని పోలీసు చేయాలనే లక్ష్యంతో  ఎంతో వ్యయంతో నగరంలో ఐదు జోన్లలో 7000 మందికి మూడు నెలల పాటు ఉచితంగా ఫ్రీ రిక్రూట్మెంట్ లో  శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర జాయింట్ సీపీ డాక్టర్ రమేష్ రెడ్డి, ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసిపి సునీల్ దత్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపి ఆకుల శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, తోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.