ఊరు మనదిరా.. అంటూ గర్జించిన ధిక్కార స్వరం మూగబోయింది

C
– ప్రజాగాయకుడు గూడ అంజయ్య ఇకలేరు

– కన్నీటీ సంద్రమైన కళాప్రపంచం

– నేడు సంతూరుకు అంజయ్య భౌతిక ఖాయం

హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నారు. గూడ అంజయ్య సాయంత్రం రంగారెడ్డి జిల్లా హయాత్‌ నగర్‌ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు.  ఆయన 1955లో ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా అంజయ్య ఎన్నో కథలు, పాటలు రాశారు. ఆయన రాసిన నేను రాను బిడ్డో సర్కార్‌ దవాఖానకు’ అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఆయన వ్రాసిన ‘ఊరు మనదిరా’ పాట 16 భాషలలో అనువాదం అయింది. అలాగే . ‘రాజిగా వోరి రాజిగా’ పాట తెలంగాణ ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపింది. ఈ ఏడాది సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసారు. అంజన్నకు ముగ్గురు కుమార్తెలు. గత నెల 25న ఆయన అనారోగ్యంతో నిమ్స్‌ లో చేరారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్‌ చేశారు. గూడ అంజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులు తన సంతాపం తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ, పాశం యాదగిరి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. ఇక ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే…పాట కోసం పాట ఏనాడూ రాయలేదు.. ఇప్పటికీ రాయలేను కూడా! అని చివరి క్షణం దాకా గూడ అంజయ్య(61) చెప్పిన మాటలు. ప్రజల కష్టాన్ని చూసి.. దాన్ని తాను అనుభవించి.. చలించిపోయాకే రాస్తాను అని చెప్పిన ప్రజా గొంతుక మూగబోయింది. తాను రాసిన పాటలన్నీ ప్రజల్లో నుంచే పుట్టినవి అని చెప్పిన గొప్ప కవి, రచయిత అంజయ్య తుదిశ్వాస విడిచాడు. ఓ రైతు మాటలనే పాటగా రాసిన గూడ అంజయ్య మొదటి పాట.. ‘ఊరిడిసి నేబోదునా / అయ్యో ఉరిపెట్టుకుని సత్తునా.’ ఈ పాటకు ఎనలేని ఆదరణ లభించింది. ఊరిడిసి అనే పదంతో గళమెత్తిన అంజయ్య ఇవాళ ఊరిడిసి పోయాడు. పల్లె ప్రజలు అంజయ్య పాటలను నెమరేసుకుంటున్నారు. ‘భద్రం కొడుకో.. కొడుకో కొమురన్న జర పయిలం కొడుకో’ పాట కూడా బాగా పాపులర్‌ అయింది. ఈ పాటను బి. నర్సింగ్‌రావు నిర్మించిన రంగుల కల సినిమాలో ఉపయోగించుకున్నారు. తన ఇరవై ఏట తెలంగాణలో దొరల ఆగడాలు ఎక్కువై పోయిన సమయంలో ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనదిరా.. ప్రతి పనికి మనంరా.. సుత్తి మనది కత్తి మనది పలుగు మనది పార మనది.. బండి మనదిరా.. బండెడ్లు మనవిరా.. నడుమ దొరయెందిరో..’ అనే పాట తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ పాటను ఆర్‌. నారాయణమూర్తి తన సినిమాలో వాడుకున్నారు. నేను రాను బిడ్డో సర్కార్‌ దవఖానాకు పాటకు ఎంతో ఆదరణ లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాశారు. అయ్యోనివా నువ్వు.. అవ్వొనివా అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చింది. రాజిగా వోరి రాజిగా అనే పాట ఉద్యమంలో ఉత్తేజం నింపింది.

ఇవే కాకుండా ఉద్యమానికి సంబంధించి ఎన్నో పాటలు రాశారు. అంజయ్య కలం నుంచి ‘పొలిమేర’ అనే నవల వెలువడింది. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల నేపథ్యంలో విప్లవ విద్యార్థి నాయకుడు, ప్రజాగాయకుడు గోపి అన్న ప్రధాన పాత్రను కేంద్రబిందువుగా తీసుకుని ఆనాటి సామాజిక, రాజకీయ పరిణామాలను చక్కటి కథా కథనంతో అంజయ్య ఆవిష్కరించారు. ‘గిరిజన మహిళా మేలుకో’ అనే నాటికకు విపరీతమైన స్పందన లభించింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ’, ‘తెలంగాణ బుర్రకథ’ సీడీలను ఆవిష్కరించారు. సాహిత్య రత్న, దళిత కళారత్న, దళిత సేవారత్న వంటి అవార్డులను అందుకున్నారు.