ఎండల్లో జోరుగా ఉపాధి పనులు
అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు
పెద్దపల్లి,మే15(జనంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం 2019-20లో రెండు కోట్ల విలువైన పనులు చేయాలని ఉపాధి హావిూ శాఖ వారు అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 5వ విడతలో హరిత హారంలో 16 లక్షల మొక్కలు నాటేందుకు 22 గ్రామాలలోని నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. ఇక మిగతా గుట్టలపై కందకాలు, నీటి గుంతల తవ్వకం, ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టాలని ఆ శాఖ అధికారులు సంకల్పించారు. దీంతో
జాతీయ ఉపాధి హావిూ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులకు చేతినిండా పనులు
దొరుకుతున్నాయి. దినసరి కూలీతోపాటు అదనంగా భత్యాలు అందుతున్నాయి. ఎండలు దంచుతున్నా
వేసవిలో ఎలాంటి పనులు లేక ఇండ్లలో ఖాళీగా ఉంటున్న ఉపాధి కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఉదయం 6.30 నుంచి 10.30వరకు అనగా 4 గంటల పాటు కూలీలు హాజరై కందకాలు తవ్వుతున్నారు. వారికి సాధ్యమైనంత వరకు కందకాలు తవ్వే పనులు చకచకా ఉదయం పూటనే చేస్తున్నారు. ఎండ ముదిరేలోగా కూలీలు ఇంటిబాట పడుతున్నారు. సాధారణ నెలలో ఇచ్చే కూలీకంటే కేంద్ర ప్రభుత్వం కూలీలకు అదనంగా 60 వేసవి భత్యాన్ని ఇస్తున్నది. సాధారణంగా నిబంధనల ప్రకారం చేసిన పనికి 211 చెల్లిస్తారు. అదే వేసవి కాలంలో పని చేస్తే కూలీలకు అదనపు భత్యం లభిస్తుంది. దీంతో గ్రామాల్లో ఉపాధి హావిూ కూలీలతో పనులు కళకళలా డుతున్నాయి. వేతనాల సొమ్మును ఆన్‌లైన్‌లో కూలీల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఏపీఓ వివరించారు.