ఎంసెట్‌ ఫలితాలు విడుదల

1

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): తొలి తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 70.65 శాతం, వైద్యం, వ్యవసాయ విభాగంలో 85.98శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 90,556 మంది, వైద్యం, వ్యవసాయ విభాగంలో 78,794మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకులను విడుదల చేశారు.  నెల 14న  ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు.  విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు.  విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు. దీంతో ఇక ఇంజనీరింగ్‌, మెడికల్‌ కౌన్సిలింగ్‌ తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇది ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు. రికార్డు సమయంలో ఫలితాలు అందించిన జెఎన్‌టియూ కన్వీనర్‌ను మంత్రి కడియం అబినందించారు.  ఇంజినీరింగ్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన సాయిసందీప్‌ ప్రథమ ర్యాంకు సాధించినట్లు  కడియం శ్రీహరి ప్రకటించారు. 160 కి 157 మార్కులు సాధించాడని పేర్కొన్నారు. టాప్‌ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పలపాటి ప్రియాకం మెడిసిన్‌ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు శ్రీహరి తెలిపారు. ఇంజనీరింగ్‌ తొలి పది ర్యాంకుల్లో  మోపర్తి సాయి సందీప్‌ (రంగారెడ్డి ),రైతు నిహార్‌ చంద్ర (రంగారెడ్డి),బోగి కీర్తన( విజయనగరం), గుత్తా సాయితేజ(రంగారెడ్డి), వెన్నపూస హేమంత్‌రెడ్డి(రంగారెడ్డి), తన్నీరు శ్రీహర్ష(రంగారెడ్డి), మజ్జి సందీప్‌ కుమార్‌(విజయనగరం), గార్లపాటి శ్రీకర్‌(హైదరాబాద్‌), దొంతుల అక్షిత్‌రెడ్డి(వరంగల్‌),కొండపల్లి అనిరుధ్‌రెడ్డి(హైదరాబాద్‌) ఉన్నారు. మెడిసిన్‌ అగ్రికల్చర్‌లో ఉప్పలపాటి ప్రియాకం(ప్రకాశం), కడ శ్రీవిధుల్‌(హైదరాబాద్‌), వంగాల అనూహ్య(నల్గొండ),పారశెల్లి సాయితేజ(విశాఖ) చెన్నూరి సాయితేజారెడ్డి(వరంగల్‌), పైడి తేజేశ్వరరావు(శ్రీకాకుళం), పొన్నాడ నాగ సత్య వరలక్ష్మి(తూర్పుగోదావరి జిల్లా), బాలబోలు కీర్తన షన్ముఖ(విశాఖ), అన్ష్‌ గుప్తా(హైదరాబాద్‌), సాయి ప్రీతమ్‌ చిరంచెట్టి( వరంగల్‌) ఉన్నారు.