ఎంసెట్ -2 రద్దు దిశగా సర్కారు!
– నివేదిక రాగానే నిర్ణయం
– మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్,జులై 27(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-2 పరీక్షపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించడంతో పరీక్ష రద్దు చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎంసెట్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సీఐడీ నివేదిక రేపు అందే అవకాశం ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి తెలిపారు. నివేదిక అందిన తర్వాతే ఎంసెట్-2 రద్దుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. లీకేజీకి పాల్పడిన వారిపై మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
సీఐడీ నిర్ధారణ
తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది. ప్రశ్నాపత్రం లీకేజీ ద్వారా 30మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రశ్నాపత్రం దిల్లీలోని ముద్రణా కేంద్రం నుంచే లీకైనట్లు సీఐడీ గుర్తించింది. విద్యార్థులను రెండు రోజుల ముందు ముంబయి, బెంగళూరు తీసుకెళ్లి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు గుర్తించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఒప్పందం చేసుకున్నారు. నిందితులు గతంలోనూ పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
రద్దు చేయొద్దు
ఎంసెట్-2 పరీక్ష రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలతో పరీక్ష రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి.. పరీక్ష రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఎంసెట్ పేపర్ లీకేజీలో కీలక వ్యక్తి అరెస్ట్
తెలంగాణ మెడికల్ ఎంసెట్-2 పేపర్ లీకేజీపై సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. ఇందుకు సంబంధించి కీలక నిందితుడు రమేష్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బ్రోకర్లుగా చెలామణి అయిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరిని సీఐడీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీఐడీ ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నాయి. కాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాసిం అనే వ్యక్తిని విచారించి వదిలివేసిన విషయం తెలిసిందే. ఎంసెట్-2లో అనూహ్యంగా ర్యాంకులు సాధించిన 60 మంది విద్యార్థుల ట్రాక్ రికార్డును సీఐడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జేఎన్‌టీయూ ఇచ్చిన 60 మంది విద్యార్థుల ర్యాంకుల జాబితాను పూర్తిగా పరిశీలించింది. వారి నుంచి సేకరించే వివరాలను అధికారికంగా నమోదు చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను విచారించేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు వరంగల్, భూపాలపల్లి, పరకాల, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాయి. దీంతో ఎంసెట్-2 రద్దు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధమౌతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ కావడడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదుపై సీఐడీ విచారణ జరుపుతున్న విచారణలో పలు విసయాలు వెల్లడవుతున్నాయి. అధికారుల విచారణలో ఎంసెట్-2లో జరిగిన అక్రమాలు ఒక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థుల ర్యాంకుల్లో భారీగా తేడా ఉన్నట్లు గుర్తించిన సీఐడీ.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ల కాల్‌డేటా పరిశీలించింది. అనంతరం విద్యార్థులు కోచింగ్ తీసుకున్న సెంటర్లు, కన్సల్టెంట్లపై విచారణ చేపట్టింది. 3 ఎంసెట్లలో కూడా విద్యార్థుల ర్యాంకుల్లో భారీ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 40 రోజుల్లో విద్యార్థుల ర్యాంకులు వేలల్లో నుంచి వందల్లోకి వచ్చాయి. ఇంటర్‌లో 4 సార్లు ఫెయిలైన విద్యార్థులకు సైతం 100 లోపు ర్యాంకులు వచ్చాయి. పేపర్ ముద్రించిన ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం తీకైనట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. అధికారులు ఇప్పటికే కొందరు విద్యార్థులను ప్రశ్నించారు. కాగా కన్సెల్టెంట్లు పరారీలో ఉన్నారు. ఒకటిరెండు రోజుల్లో ఎంసెట్-2 రద్దు చేసే ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి పంపనున్నారు. అక్రమాలకు పాల్పడ్డ 69 మంది విద్యార్థులకు ఉచ్చు బిగుసుకుంటుంది.




