ఎకరం భూమి కోసం …
దళిత తండ్రి కొడుకుల దారుణ హత్య
– భగ్గుమన్న ప్రజా సంఘాలు
– నేడు చలో కందికట్కూర్
సిరిసిల్ల,జూన్ 12(జనంసాక్షి):కోర్టులో ఓ దళితకుటుంబం గెలుచున్న భూమికోసం దుండగులు దారుణానికి ఒడిగట్టారు .కేవలం ఎకరం భూమి కోసం తండ్రి కొడుకులను నరికి చంపేశారు. అనాదిగా తాము అనుభవిస్తూ వస్తున్న భూమిపై వివా దం సృష్టించి తమదేనని కొందరు పెత్తందార్లు కోర్టుకెక్కారు. న్యాయపోరాటంలో గెలువలేకపోయిన వారు కండబలంతో గెలవాలని ఈ దారుణానికి ఒడిగట్టారు.ఈ వార్త దావాణంలా వ్యాపించి తండోపతండాలుగా ప్రజాసంఘాల కార్యకర్తలు తరలివచ్చారు. జరిగిన ఘోరాన్ని చూసి భగ్గుమన్నారు. బాధితులకు న్యాయం చేయాలని నేడు చలో కందికట్కూర్‌కు పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే… భూ తగాదాలు తండ్రీకొడుకులను బలితీసుకున్నాయి. ప్రత్యర్థులు వీరిని హతమార్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో మంగళవారం ఉదయంఈ దారుణం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతులు తండ్రి ఎల్లయ్య, కొడుకు శేఖర్‌గా గుర్తించారు. భూ తగాదాల కారణగా తండ్రీ కొడుకులు దారుణహత్యకు గురయ్యారని స్థానికులు అన్నారు. ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగిన జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన చామనపల్లి ఎల్లయ్య (55), అతని కొడుకు శేఖర్(25)ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు ఉదయం పొలం దున్నుతుండగా గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. ఎకరం పొలం విషయంలో అదే గ్రామానికి చెందిన కొందరితో ఎల్లయ్య కుటుంబానికి కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేకువజామున 5 గంటల ప్రాంతంలో తండ్రీకొడుకులను పొలంలోనే హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ హత్యల్లో నలుగురు పాల్గొనగా.. ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో సూరెపల్లి సూజాత, కుల నిర్మూలణ పోరాట సంఘం సభ్యులు, యూ. సంబశివరావు, బండారు లక్ష్మయ్య, సుదర్శన్ మార్వాడి తదితరులు పాల్గొన్నారు.