ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించి ముంపు భూములను తీసుకోవాలి – అన్నారం బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పంపిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి ,మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చాలా గ్రామాలలో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజి బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురైన రైతుల భూములను సర్వే చేయించి తగు పరిశీలనలు చేసి ప్రభుత్వం ద్వారా ఎకరానికి రూ. 15 లక్షలు నష్ట పరిహారం చెల్లించి ముంపు భూములను తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పంపిన వినతి పత్రాన్ని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కి కాంగ్రెస్ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. అన్నారం ప్రాజెక్టు నిర్మాణం అయినప్పటి నుండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన మంథని మండలంలో చాలా గ్రామాలైన ఆరెంద, మల్లారం, ఖాన్సాయిపేట, అమ్మగారి పల్లె, ఖానాపూర్,ఇతర గ్రామాలలోని రైతులు దాదాపుగా 650 ఎకరాల వరకు పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయని, ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన ఇప్పటికే రైతులు 6 పంటలను కోల్పోయినప్పటికి ప్రభుత్వం వీరికి ఎలాంటి నష్ట పరిహారం అందజేయలేదని పేర్కొన్నారు. ఈ అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడముతో చాలా వ్యవసాయ భూములు మొత్తం మునిగి పోయాయని, ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ సర్వే విభాగము వారు కలిసి కొలతలు చేసి హద్దులు ఖాయం చేసినారని, ప్రభుత్వం గతంలో చెల్లించిన విధంగా ప్రస్తుతం బ్యారేజి ముంపునకు గురవుతున్న సన్నకారు, చిన్నకారు రైతులకు ఎకరానికి రూ. 10.50 లక్షల రూపాయలు కాకుండా ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఎకరానికి 15 లక్షల రూపాయలు రైతులకు నష్ట పరిహారం ఇచ్చి, వారి భూములకు తగిన న్యాయం చేయగలరని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రం ద్వారా కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మంథని మండల కాంగ్రెస్ నాయకులు సెగ్గం రాజేష్, మల్లారం సర్పంచ్ మానెం సత్యనారాయణ, సింగల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు కుడుదుల వెంకన్న, ఊట్ల అనిల్ రెడ్డి, మానేమ్ రాజేందర్, కొమ్మిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.