ఎక్కడి లారీలు అక్కడే

5
– స్తంభించిన సరుకు రవాణా

హైదరాబాద్‌,జూన్‌24(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో లారీల సమ్మె ప్రారంభమైంది. అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌ మహానగరంలో అర్థరాత్రి దాటిన తర్వాత లారీలు బయటకి కదల్లేదు. దీంతో హైదరాబాద్‌ శివారు ఎన్టీఆర్‌ నగర్‌ ప్రాంతంలో భారీగా నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం లారీ యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్థరాత్రి నుంచి సమ్మె అనివార్యమైంది. రవాణాపన్ను తగ్గించడంతో పాటు… రెండు రాష్ట్రాల మధ్య సింగిల్‌ పర్మిట్‌ ప్రవేశపెట్టడంతో సహా 11 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. సమ్మె కారణంగా  రాష్ట్ర వ్యాప్తంగా 3.50లక్షల లారీలు, ట్రక్కులు నిలిచిపోయాయి. ఉదయం 7గంటల ప్రాంతంలో ఆటోనగర్‌ వద్ద లారీలను అడ్డుకునేందుకు యజమానులు సిద్ధమయ్యారు. లారీల సమ్మెతో వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచారు. కూరగాయలు, నిత్యావసరాల ధర పెంపుతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా  అర్ధరాత్రి నుంచి సరకు రవాణా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. లారీ యజమానులతో మంగళవారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చొరవా లేకపోవటంతో ముందుగా చెప్పినట్లుగానే బంద్‌ పాటిస్తున్నట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రకటించింది. ఉభయరాష్ట్రాలు వేర్వేరు రవాణాపన్ను విధానాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో, పన్నుభారం తగ్గించాలని యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో 23 జిల్లాల్లో తిరిగేందుకు చెల్లించిన పన్నునే ఇప్పుడు కేవలం పది జిల్లాల్లో తిరిగేందుకే చెల్లించాల్సి వస్తోందని… ఇది సరకు రవాణావ్యవస్థకు భారంగా మరిందని లారీల యజమానులు వాపోతున్నారు. జనాభానిష్పత్తి ప్రకారం పన్ను వసూలును తగ్గించాలని చర్చల్లో కోరినట్లు సంఘం ప్రతినిధులు చెప్పారు. రెండు ప్రధాన డిమాండ్లు సహా మొత్తం 11 అంశాలను ప్రభుత్వం ముందుంచామని, ఒక్క విషయంలోనూ సానుకూలమైన హావిూ లభించలేదన్నారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా పాలు, పెట్రోలు, డీజిల్‌ వాహనాలను సమ్మె నుంచి మినహాయిస్తున్నామని ప్రకటించారు.