ఎట్టకేలకు అజ్ఞాతం వీడి!


– నేను ఎక్కడకూ పారిపోలేదు..
– బెంగళూరు కైం బ్రాంచ్‌ ముందుకు గాలి జనార్దన్‌ రెడ్డి
– అంబిడెంట్‌ కంపెనీని కాపాడేందుకు లంచం తీసుకున్నట్టు గాలిపై ఆరోపణలు
ముంబయి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : కర్ణాటక బీజేపీ నేత, మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. శనివారం బెంగళూరు సిటీ కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. తనకు నిన్ననే పోలీసుల నోటీసులు అందాయని… అందుకే ఈరోజు పోలీసుల విచారణకు హాజరయ్యానని చెప్పారు. పోలీసుల విచారణకు హాజరయ్యే ముందు గాలి ఒక వీడియోను విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని, పోలీసుల విచారణకు సహకరిస్తానని వీడియోలో వెల్లడించారు. తాను ఎక్కడకూ పారిపోలేదని, బెంగళూరులోనే ఉన్నానని తెలిపారు. అంబిడెంట్‌ అనే కంపెనీని ఈడీ నుంచి కాపాడేందుకు లంచం తీసుకున్నట్టు గాలిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 55 కిలోల బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశం విడిచి వెళ్లిపోయారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఫోన్‌ లొకేషన్‌ ను బట్టి ఆయన హైదరాబాదులో ఉన్నారని పోలీసులు అనుమానించారు. దీంతో, బెంగళూరు నుంచి ఆయన కోసం పోలీసులు హైదరాబాద్‌ బయల్దేరినట్టు వార్తలు వినిపించాయి. ఇంతలోనే, ఆయన కైమ్ర్‌ బ్రాంచ్‌ ముందుకు రావడం గమనార్హం. ఈ సందర్భంగా తనతో పాటు తన
న్యాయవాదులను కూడా తీసుకొచ్చారు.