ఎట్టకేలకు శ్రీకాళహస్తికి పాలకమండలి
పాలక మండలి ఛైర్మన్‌గా అంజూరు తారక శ్రీనివాసులు
16మంది సభ్యలుతో బోర్డు పునర్నియామకం
తిరుపతి, మార్చి2(జనం సాక్షి): సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. పాత బోర్డు పదవీకాలం ముగియడంతో 2017 సెప్టెంబర్ నుంచి ఆలయానికి పాలక మండలి లేదు. 16 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం నియమించి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును పాలక మండలి ఛైర్మన్‌గా ఖరారు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 2021 జూలైలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా సత్యవేడు నియోజకవర్గానికి చెందిన బీరేంద్ర వర్మ ఒక్కరి పేరునే ప్రకటించింది. దాంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాధారణంగా బోర్డు ఛైర్మన్ పదవికి అభ్యర్థిని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే ఎంపిక చేస్తారు. అయితే, సత్యవేడుకు చెందిన బీరేంద్ర వర్మ పేరును ప్రకటించడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాలక మండలి నియామకం కాస్తా నిలిచిపోయింది. చివరకు మహా శివరాత్రిని పురస్కరించుకుని మధుసూదన్‌రెడ్డి
విజ్ఞప్తిని మన్నించిన వైసీపీ ప్రభుత్వం.. ఈ మేరకు పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఛైర్మన్ ఎవరనేది స్పష్టం చేయనప్పటికీ.. ఎమ్మెల్యే మధుసూదన్ తన అనుచరుడు తారక శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. దాంతో తారక శ్రీనివాసులు బోర్డ్ చైర్మన్‌గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రూ.120 కోట్ల వార్షిక బ్జడెట్‌తో దేవస్థానానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన కొత్త బోర్డును నియమించేందుకు గత టీడీపీ ప్రభుత్వంగానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గానీ ఆసక్తి చూపలేదు. వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు పూజ సామాగ్రి సేకరణ, తాత్కాలిక నియామకాలు, ఇతర విషయాలతోపాటు ఆలయ నిర్వహణకు సంబంధించిన పలు అంశాల్లో అక్రమాలు జరిగాయని పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుడు తారక శ్రీనివాసులు ఎలా నెగ్గుకొస్తారని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.