ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ
– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం
హైదరాబాద్, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) గురువారం ఇక్కడ లాంఛనంగా విడుదల చేసింది. ఐదంచెల విధానంతో హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సాగర్ ప్రక్షా ళన కోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్ఎండీఏ ప్రజలను కోరింది. చారిత్రాత్మకమైన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు భవిష్యత్తు రక్షణ కోసం హెచ్ఎండీఏ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఇటీవల జరిగిన చెరువుల పరిరక్షణ కమిటీ ప్రత్యేక సమావేశంలో హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోని చెరువుల పరిరక్షణతో ప్రక్షాళన, నీటి నాణ్యత, ప్రమాణా లను రక్షించే వీలుందని గుర్తించారు. ఈ మేరు ప్రత్యేకంగా సెంట్రల్ బెసిన్ ప్రాంతంగా ప్రతిపా దించారు. సెంట్రల్ బెసిన్ పరిధిలోని చెరువుల పరిరక్షణతో సాగర్ జలాల నాణ్యత కాపాడటంతో పాటు కాలుష్యం బారి నుంచి రక్షించే వీలు ఉంది. ఇందులో భాగంగా సెంట్రల్ బెసిన్ పరిధిలోని చెరువులను గుర్తించేందుకు క్షేత్ర స్థాయి సర్వేను నిర్వహిస్తారు. ఇప్పటికే హెచ్ఎండీఏ చెరువుల పరిరక్షణ విభాగం ఆయా శాఖాధికారులకు సెంట్రల్ బెసిన్ చెరువుల క్షేత్ర స్థాయి సర్వే కోసం ప్రత్యేకంగా లేఖను రాశారు. ఈ నెలాఖరులోగా రెవెన్యూ ఇరిగేషన్, హెచ్ఎండీఏ, గ్రేటర్ తదితర శాఖాధికారుల సంయుక్తాధ్వర్యంలో క్షేత్ర స్థాయి సర్వేను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెంట్రల్ బెసిన్ సర్వేను నెల రోజుల లోపు పూర్తి చేయాలని భావిస్తన్నారు. అనంతరం ఈ చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ ఖరారు చేస్తారు. ఇదిలా ఉండగా, జైకా (జపాన్ బ్యాంక్) నిధులతో సెంట్రల్ బెసిన్ చెరువులను పరిరక్షించేందుకు హెచ్ఎండీ చెరువుల విభాగం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది.
కేంద్రానికి రూ. 100 కోట్ల ప్రతిపాదనలు
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులను రాబట్టేందుకు రూ. కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జాతీయ నుదల పరిరక్షణ పథకంలో నిధుల కోసం ప్రతి పాదనలు పంపారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు, నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
జనవరిలో పనుల ఆరంభం..
హుస్సేన్‌సాగర్‌లో చేపట్టే ఎన్విరాన్మెంట్ డ్రెడ్జిం పనులను జనవరి మాసంలో ఆరంభించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.30 కోట్ల వ్యయ అంచనాలతో 6.5 లక్షల కాలమ్స్ వ్యర్థ పదార్థాలను తొలగిస్తారు. ప్రధానమైన బాలాపూర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, పికెట్ నాలాల పరిధిలో పనులు నిర్వహిస్తారు. హుస్సేన్‌సాగర్ జలాశయం ప్రక్షాళన పనులలో భాగంగా కూకట్పల్లి నాలా మురుగునీటి మళ్లింపు, ఏడు హైజెట్ ఫౌంటేన్లను హెచ్ఎండీఏ చైర్మన్, ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగు రోజులక్రితం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్చి 2013లోగా హుస్సేన్‌సాగర్ జలాశయం ప్రక్షాళన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రూ.370 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండగా, ఇప్పటి వరకు రూ.122 కోట్ల వ్యయం చేశారు. కాగా, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టును 2008లో చేపట్టారు. వీటిలో ఖైరతాబాద్, పికెట్ నాలాల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, ఫతేనగర్, పికెట్ నాలా, బల్కపూర్ నాలా, కూకట్పల్లి నాలా డ్రైవర్షన్ పనులను సెపెంబర్ 2010లోగా పూర్తి చేయాలి. వీటిలో కేవలం కూకట్పల్లి నాలా పనులను మాత్రమే పూర్తి చేయగా, మిగతా పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. వీటితోపాటు తొమ్మిది మీటర్ల గ్రీన్‌బెల్ట్, నాలా పరిధిలో పునరావాసం తదితర పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సిందే.