ఎట్లొస్తయ్ పతకాలు ?
17 రోజుల విశ్వ క్రీడా సంబురాలు కిందటి సోమవారంతో ముగిశాయి. ఈ క్రీడల్లో భారతదేశ 121 కోట్ల మంది ఆశలను మోసుకెళ్లిన వారు సాధించిన పతకాల సంఖ్య ఆరు. ఇండియా రాజధాని ఢిల్లీ నగరమంత జనాభా కూడా కజకిస్థాన్ 7 స్వర్ణాలు ఎగిరేసుకు పోయింది. నిండా యాభై లక్షల జనం కూడా లేని క్రొయేషియా దేశం కూడా 3 పతకాలు చేజిక్కించుకుంది. మరి 121 కోట్ల మంది జనాభా ఉన్న జనాభా ఉన్న మన దేశానికి ఎన్ని పతకాలు రావాలి ? ఈ ఆలోచన కలిగేది మన కన్నా చిన్న, తక్కువ జనాభా ఉన్న దేశాలతో పోల్చుకుంటేనే ! మరి ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఒలింపిక్స్ పతకాల సాధనలో మన కన్నా వెనుకబడ్డాయా అని పరిశీలిస్తే.. మన కన్నా ఎక్కువ జనాభా ఉన్న, అంటే 132 కోట్ల జనాభా ఉన్న చైనా సాధించిన పతకాల సంఖ్య ఎంతో తెలుసా ? 38 స్వర్ణాలు, 27 రజితాలు, 23 కాంస్యాలు. ఇదీ లెక్క. మన కన్నా ఎక్కువ జనాభా ఉన్నవారూ సాధించారు.. తక్కువ జనాభా ఉన్నవారూ సాధించారు. కానీ, మనమే వెనుకబడ్డాం. ఎందుకు ? లండన్ ఒలింపిక్స్ సన్నాహాల్లో ఏమైనా తక్కువ చేశామా ? అదీ లేదు. అక్షరాల 266 కోట్లు ఖర్చు చేశాం. ఈ లెక్కన మన అథ్లెట్లు సాధించిన 6 పతకాల్లో ఒక్కోదానికి 43 కోట్లు ఖర్చు పెట్టామన్న మాట ! ఔరా.. ఎంత ‘విలువైన’ పతకాలు సాధించామో కదా ! మనతోనే ఎందుకిలా ? మన అథ్లెట్లే ఎందుకిలా ఒలింపిక్స్‌లో వెనుకబడుతున్నారు. జనాభాయే కారణమా ? ఇదే కారణమైతే చైనా మన కన్నా వెనుకబడాలి. కానీ, ఎప్పుడూ ఒలింపిక్స్‌లో చైనా తొలి మూడు స్థానాల్లోనే ఉంటుంది. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా తొలిస్థానం దక్కించుకుంది. అయినా, మనకే ఎందుకిలా ? ఎందుకంటే, మన దేశంలో క్రీడాకారులను పట్టించుకునే దిక్కు లేదు. మన రాజకీయ నాయకులకు స్కాంలు చేయడంతోనే ఫుర్సత్ లేదు. అటువంటప్పుడు ఎట్లొస్తయ్ పతకాలు ? చైనాలో వీధికో స్టేడియం ఉంటుంది. అక్కడ ఒక చిన్నారిని క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు భావిస్తే, ఆ చిన్నారి పూర్తి బాధ్యతను అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. మరి మన దేశం సంగతి తెలియందేముంది ? నాకు ఆటొచ్చు.. నేను ఆడుతా.. అని ఎవరైనా ముందుకొస్తే, నిన్ను పంపిస్తే ‘నాకేంటి’ అనే రాజకీయ నాయకులే ముందు ఎదురుపడుతారు. కళ్లు మూసుకుని విల్లు ఎక్కు పెట్టగల ఆదివాసులను ‘ఆర్చరీ’ విభాగంలో, ముక్కు మూసుకుని సముద్రాన్ని ఈదే సామర్థ్యమున్న గంగపుత్రులను ‘స్విమ్మింగ్’ విభాగంలో ఇంకా తీర్చిదిద్దవచ్చన్న ఆలోచన మన పాలకులకు ఎన్నడూ రాలేదు. చైనాలో మూడు వేల స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. మన దగ్గర ఎన్నున్నాయో మన క్రీడల మంత్రికే తెలియదు. అక్కడక్కడ ఉన్నా వాటిని ఆలనా పాలనా చూడరు. అటువంటప్పుడు ఎట్లొస్తయ్ పతకాలు. ఆరు పతకాలు వచ్చినందుకే మనం ఆరు వారాలు సంబురాలు జరుపుకుంటే, 66 పతకాలు సాధించిన దేశం ఎన్ని వారాలు జరుపుకోవాలి ? అందుకే, పతకాలు పండించిన వారిని అభినందించడం మంచిదే. కానీ, ఆ పతకధారులను ఆ తర్వాత మరిచిపోవడమే మనకే దెబ్బకొస్తున్నది. వాళ్లకు ప్రోత్సాహం అందిస్తే మరింత మంది పతక సాధకులను తయారు చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై లండన్ ఒలింపిక్స్‌లో చివరి స్థానంలో హాకీ ఒకప్పడు 5 స్వర్ణాలు సాధించిందని తెలుసుకోవాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మన జాతీయ క్రీడ హాకీ ఇప్పుడు తన ప్రకాశాన్ని క్రికెట్ మూలంగా కోల్పోయింది. నేడు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడలనైనా బతికించుకోవాల్సిన అవసరమున్నది. వీటికి కూడా హాకీ గతి పట్టకుండా కాపాడుకోవాలి. దీని కోసం ఉద్యుక్తులమై కృషి చేయాలి. పాలకులారా.. కన్నులు తెరవండి. కజకిస్థాన్ వంటి చిన్న చిన్న దేశాలు క్రీడల కోసం చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోండి. మన దేశంలోనూ స్పోర్ట్స్ స్కూళ్లు ప్రారంభయ్యేందుకు ప్రయత్నించండి. క్రీడాకారులను ప్రోత్సహించండి. వచ్చే ఒలింపిక్స్‌లోనైనా భారత క్రీడా పతాకం సగర్వంగా ఎగిరేస్తామని కంకణబద్ధులు కండి..