ఎన్టీపీసీ పేలుడు ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఊంచాహార్‌లో ఎన్టీపీసీలో బాయిలర్‌ పేలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది 80 శాతానికి పైగా కాలినట్లు వైద్యులు తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌..
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అంతకుముందు ఘటనా స్థలికి వెళ్లి అధికారులను ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీపీసీ కర్మాగారంలోని ఆరో యూనిట్లో బుధవారం సాయంత్రం సుమారు 20 విూటర్ల ఎత్తులో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ  పనిచేస్తున్నవారంతా భయంతో ఉలిక్కిపడ్డారు. బాయిలర్‌ నుంచి అకస్మాత్తుగా వేడి వాయువులు, ఆ తర్వాత బూడిద లాంటి పదార్థం వెలువడి ఆ ప్రాంగణాన్ని కమ్మేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాయ్‌బరేలీ జిల్లాలోని ఊంచాహార్‌లో ఉన్న ఎన్టీపీసీలో ఆరో యూనిట్‌ను ఈ ఏడాదే ఏర్పాటు చేశారు. 1550 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ 9 రాష్టాల్రకు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఇందులో మొత్తం 870 మంది కార్మికులు పని చేస్తున్నారు.