ఎన్డీఏ తప్పుడు విధానాల వల్లే..

రూపాయి విలువ పడిపోతోంది!
– జీడీపీ వృద్ధిరేటు విషయంలో అసత్యాలు చెబుతోంది
– పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కేంద్రం విధానాలే కారణం
– కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే
బెంగళూరు, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎన్డీఏ అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్లే రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ‘ఇటీవల సగటు జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉందని, అయితే, ఇప్పుడు 8.2 శాతం ఉందని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఒక్కసారిగా ఇంత ఎలా పెరుగుతుందాని ఖర్గే ప్రశ్నించారు. ఎన్డీఏ పాలనలో వ్యవసాయ వృద్ధిరేటు కూడా పడిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సమాజంలో సామరస్యాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయిన సమయంలోనూ గత యూపీఏ ప్రభుత్వం భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగకుండా నియంత్రించిందన్నారు. కానీ, ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఎన్డీఏ సర్కారు ధరలు పెంచుతోందని విమర్శించారు. దీనివల్ల దేశంలోని రైతులపై కూడా ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల ద్వారా వస్తోన్న కోట్ల రూపాయల ఆదాయాన్ని అనవసర విషయాలపై ఖర్చు చేస్తోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని అన్నారని, కానీ, హావిూని నెరవేర్చలేదని, ఈ అంశం యువతపైనే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిందని ఖర్గే విమర్శించారు.
——————————————