ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు
జగిత్యాల,డిసెంబర్4(జనంసాక్షి): జిల్లాలో ఎన్నికలకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశించారు. జిల్లాలో 898 పోలింగ్ కేంద్రాలుండగా 179 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పోలింగ్ పక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ కేంద్రాల్లో సీసీ
కెమెరాల పనితీరు పరిశీలించాలన్నారు. ఓటరు పట్ల మర్యాదగా మెలగాలని గత ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే గ్రామాల్లో అదనపు భద్రత కల్పించాలని వివాదాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ సజావుగా జరిగి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.