ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం
కొత్త ఇమ్మిగ్రేషన్ కార్యక్రమానికి బైడెన్ శ్రీకారం
వాషింగ్టన్,ఆగస్ట్20 (జనంసాక్షి): అమెరికన్ సిటిజన్ షిప్ గల వారి ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాములకు సిటిజన్ షిప్ కార్యక్రమాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించారు. చట్ట విరుద్ధంగా అమెరికాలోకి వచ్చి దీర్ఘకాలంగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే నవంబర్ ఐదో తేదీన దేశాధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం అమలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ చట్టంతో అమెరికా పౌరసత్వం గల భార్యతోపాటు ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న మిగౌల్ అలెమన్ అనే ఉబెర్ డ్రైవర్ (39)కి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. నాలుగేండ్ల వయస్సులోనే అలెమన్.. మెక్సికో నుంచి అమెరికాకు వచ్చాడు. మెక్సికోతోపాటు, ఎల్ సాల్వడార్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల నుంచి చట్ట విరుద్ధంగా అమెరికాలోకి వచ్చిన ఇమ్మిగ్రేంట్లలో అలెమన్ ఒకరు.ఇటువంటి వారు అమెరికాలో లక్షల మంది అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ చట్టం అక్రమం అని రిపబ్లికన్ పార్టీ చెబుతోంది. జూన్ లో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం ఐదు లక్షల మంది అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు విదేశీ ఇమ్మిగ్రెంట్లు ఉన్నారని సమాచారం. గత జూన్ 17 నాటికి కనీసం పదేండ్ల పాటు వీరంతా అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా పౌరసత్వం గల తల్లిదండ్రులతో జీవిస్తున్న 50 వేల మంది పిల్లలు కూడా ఈ చట్టం కింద అమెరికా సిటిజన్ షిప్ పొందుతారు.