ఎన్నికల్లో గద్దర్ పోటీకు ఒప్పుకున్నాడు
హైదరాబాద్, సెప్టెంబర్ 8(జనంసాక్షి) :
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్ లోక్ సభకు జరిగే ఉప ఎన్నికలో పోటీచేయడానికి సానుకూలత వ్యక్తం చేశారని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. గద్దర్ తో తాము సంప్రదించామని, వామపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఉండాలని తాము కోరామని, అందుకు ఆయన సుముఖంగానే ఉన్నారని ఆయన అన్నారు. పాలకుర్తిలో జరిగే చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఆయన హాజరు కావచ్చని, అక్కడ ఆయన ఈ విషయం ప్రకటించవచ్చని తమ్మినేని తెలిపారు. టిఆర్‌ఎస్ పక్షాన ఎన్నికైన కడియం శ్రీహరి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా నియాకం కావడంతో ఆయన వరంగల్ ఎంపి పదవికి రాజీనామా చేశారు. కడియం రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అవుతుంది. కాగా నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలో సిపిఎం పోటీచేస్తుందని కూడా వీరభద్రం తెలిపారు. ఇదిలావుంటే ధనికుల కోసమే స్మార్ట్ సిటీస్‌ను కేంద్రం నిర్మించాలనుకుంటోందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లో విూడియాతో మాట్లాడుతూ…స్మార్ట్ సిటీలు సామాన్యులకు అందనంత దూరంలో ఉంటాయని, పేదలను పట్టణ, నగర జీవనానికి దూరం చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. స్మార్ట్ సిటీల కోసం విడుదలైన నిధులు కూడా కేంద్రం నుంచి రాలేదని, ప్రపంచబ్యాంకు నుంచి వచ్చాయని చెప్పారు. బ్యాంకు షరతులకు తలొగ్గి స్మార్ట్ సిటీల్లో ఛార్జీల మోత మోగబోతోందని అన్నారు. ఈ పరిణామం పేదలను నగర జీవనానికి దూరం చేయబోతోందని, దీన్నిసీపీఎం ఖండిస్తోందని చెప్పారు.