ఎన్నికల్లో పోటీ చేయను
జనం పాటగానే ఉంటా
లోతైన చర్చ జరగాలి: గద్దర్
హైదరాబాద్,సెప్టెంబర్14(జనంసాక్షి):
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ పోటీచేయబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు గద్దర్ తెరదించాడు. తాను ఉపఎన్నికలో పోటీ చేయడంలేదని సోమవారం ఆయన విూడియాతో చెప్పారు. ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానన్నారు. ఎన్నికల్లో పోటీపై సిద్ధాంతపరమైన చర్చ జరగాల్సిఉందని గద్దర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నది. ప్రజా గాయకుడు ఒక దిక్సూచీ అని ప్రజా సంఘ నేతలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గద్దర్ నివాసానికి సుమారు 18 ప్రజా సంఘాల నేతలు చేరుకున్నారు. వారంతా గద్దర్‌తో చర్చించారు. వరంగల్ ఉప ఎన్నికపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతామని వామపక్ష పార్టీలు ఇటీవలే ప్రకటించాయి. కానీ దీనిపై గద్దర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్కడ ఎలాగైనా పోటీ చేయాలని వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజా సంఘాలు ఆయన నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. అనేక సవిూకరణాలపై వీరు చర్చలు జరిపారు. అయితే వీటన్నటిని చర్చించిన ఆయన ప్రస్తుతానికి తానుపోటీకి సుముఖంగా లేనని చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నేతలు గద్దర్‌తో ముచ్చటించారు. గద్దర్ ఒక దిక్సూచీ అని ఓయూ జేఏసీ నేత దుర్గం భాస్కర్ చెప్పారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి పార్టీ సపోర్టు లేకుండా విద్యార్థి జేఏసీగా పోరాటం చేయడం జరిగిందని, అందులో భాగంగా గద్దర్ ను కలువడం జరిగిందని తెలిపారు. ఆరు దశాబ్ధాలుగా అనేక పోరాటాలు జరిగాయని, త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేయడం లేదని, దొరల పాలన కొనసాగుతోందని విమర్శించారు. 14 నెలల కాలంలో ప్రజల హక్కులకు వ్యతిరేకంగా నడుస్తోందన్నారు. దొరల బానిసత్వం కింద నలగడానికి సిద్ధం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అందుకనే వరంగల్ ఎంపీ ఎన్నికలో గద్దర్ ను పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు. గద్దర్ తెలంగాణకు పెద్ద దిక్సూచీ అని అడ్వకేట్ జేఏసీ నేత శ్రీనివాస యాదవ్ అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం, ప్రజల క్షేమం కోసం..అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో గద్దర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయన నిర్ణయంపైనే ఆధార పడుతుందన్నారు.