ఎన్నికల ఫలితాలు చూశాకైనా ..
తెలంగాణ ఇచ్చేయండి
వాయలార్, ఆంటోనీలతో టీ కాంగ్రెస్ ఎంపీల భేటీ
న్యూఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై తమ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి టీ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ, వాయలార్ రవితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించేలా తమవంతు తోడ్పాటునందించాలని వారు ఆంటోనీని కోరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మరోసారి వెల్లడైందని, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం వల్ల ఆ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణకు సానుకూలమనే సంకేతాలిచ్చినట్టయిందని, తెలంగాణకు దాదాపుగా అన్ని పార్టీలు జైకొడుతునందున కేంద్రం వెంటనే విభజనకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని టీకాంగ్రెస్ ఎంపీలు కోరారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పటిష్టం కావాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమే మార్గమని వారు కేంద్రమంత్రికి సూచించారు.