ఎన్నికల మేనిఫెస్టోను తలపించే బడ్జెట్
ఎన్నికల్లో గెలవడం..మళ్లీ ఎన్నికల్లో గెలిచేలా పథకాలు రచించడం…ఐదేళ్ల పాలనా కాలంలో రాజకీయ నేతలు చేస్తున్న ఆలోచన ఇదే. ఈ దేశం ఏమయినా ఫర్వాలేదు..ప్రజలు ఏమయినా పర్యాలేదు. చేసే ఖర్చు..పనులు తమ ఇంటినుంచి ..సొంత జేబునుంచి ఖర్చు చేస్తున్నట్లుగా ఫీలవుతున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఓటర్లను ఆకట్టుకోవడమెలా అన్నదే పాలకుల ఆలోచనగా ఉంది. పక్కాగా పనులు చేసి దేశాన్ని ముందుకు తీసకుని పోవడమెలా…దేశాన్ని ప్రపంచ పటంలో నిలపడమెలా అన్న ధ్యాస ఉండడం లేదు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు మోడీని గద్దెనెక్కిస్తే చివరకు ఆయన కూడా ఓ సామన్యా రాజకీయ నేతలానే ఆలోచన చేశారు తప్ప విభిన్నంగా ఆలోచించలేక పోయారు. ఈ దేశాన్ని ఐదేళ్లు తన ఇష్టం వచ్చిన నిర్ణయాలతో పాలన చేసి..పోతూపోతూ తాయిలాలు విదిల్చారు. ప్రజలకు పేలాలు పంచారు. మరో మూడు నెలల వరకు ఇదో తాత్కాలిక ప్రభుత్వమే. పెట్టింది కూడా తాత్కాలిక బడ్జెట్టే.. ఏప్రిల్ తరవాత గానీ ఈ బడ్జెట్‌కు సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగవు. అప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది. అది మోడీదా మరెవరిదా అన్నది తెలియదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. గత ఐదేళ్లుగా మోడీ దేశ ఆర్థిక రంగాన్ని, మౌలిక రంగాలను పూర్తి విస్మరించి సొంత ఎజెండాతో పనిచేశారు. పదేళ్ల మన్మోహన్ పాలనతో ప్రజలు విసిగివేసారి పట్టం కడితే మళ్లీ ..కాంగ్రెస్ పార్టీయే నయం అన్నరీతిలో పాలన సాగించారు.
ఈ దశలో ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ గద్దె నెక్కేందుకు బడ్జెట్‌ను వేదికగా ఉపయోగించుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ఓ రకంగా భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సాధారణ బడ్జెట్టుకు కాస్త మార్పులు చేర్పులు చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో అదే పార్టీ మేనిఫెస్టో అయ్యేలా రూపొందించారు. సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపొందించే పనిని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని కమిటీ చేపట్టింది. శుక్రవారం నాటి బడ్జెట్టును చూస్తే కాస్త అటూఇటూగా పార్టీ మేనిఫెస్టోను ముందుగా ఆవిష్కరించినట్లయింది. బడ్జెట్‌ను పరిశీలిస్తే నాలుగు వర్గాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. పట్టణ ప్రాంత మధ్య తరగతి, వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, రైతులు… ఈ నాలుగు వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. ఏకంగా 2030 నాటికి ‘దశ దిశల దార్శనికత’ను ఆయన ఆవిష్కరించారు. దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 177 చోట్ల కనీసం 50 శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాలవారే. దీంతో వారికి సానుకూల సంకేతాలు పంపించేలా పన్నుల విషయంలో నిర్ణయాలు ప్రకటించారు. అందుకే మరోసారి అధికారాన్ని దక్కించు కోవడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌లో భారీగా తాయిలాలు ప్రకటించింది. ముఖ్యంగా దేశంలోని 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు రూ.75వేల కోట్లు లబ్ధి కలిగించేలా కొత్త పథకాన్ని ప్రకటించింది. సాగవుతున్న భూమి రెండు హెక్టార్ల కన్నా తక్కువగా ఉన్న రైతులకు ఏటా రూ.6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇలాంటి పథకం ఇంతకన్నా మంచిగా తెలంగాణలో అమయ్యింది. నేరుగా రైతు ఖాతాల్లో ఎకరాకు 8వేలు జమ అయ్యాయి. ఇకపోతే
అసంఘటిత రంగంలోని కార్మికులకూ నెలకు రూ.3000 పింఛన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను పోటుతో నలిగిపోతున్న మూడు కోట్ల మంది మధ్యతరగతి వారికి రూ.18,500 కోట్లు మేర ఉపశమనం కలిగించాలని ప్రతిపాదించింది. పేరుకైతే ఇది తాత్కాలిక బడ్జెట్టే అయినా ఎన్నికల దృష్ట్యా జనాకర్షకంగా రూపొందించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, మునుపటి ప్రభుత్వాలకు చురకలు వేస్తూనే భవిష్యత్తు దార్శనికతను ఆవిష్కరించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ప్రధాని
నరేంద్రమోదీ పలు సందర్భాల్లో బల్లపై చరిచి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్టును జులైలో ప్రవేశపెడుతుంది. నిజానికి ఈ ప్రతిపాదనలన్నీ ఏప్రిల్ తరవాతనే అమల్లోకి వస్తాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు తప్ప, దేశాన్‌ఇన, అభిశృద్దిని కాంక్షించి కాదని గట్టిగా చెప్పవచ్చు. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీలను వ్యతిరేకిస్తూ వచ్చిన మోడీ చివరకు వారి ఖాతాల్లో డబ్బులు వేయడం అన్నది ఓట్ల కోసమే అని అందరికీ తెలుసు. అందుకే సార్వత్రక ఎన్నికల ముందు సామాన్యుడిని ఆకర్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌ను చక్కటి సాధనంగా ఉపయోగించుకున్నారు. పేరుకు మధ్యంతర బడ్జెట్టే అయినా పూర్తిస్థాయి బడ్జెట్‌లో తీసుకునే కీలక నిర్ణయాలే జరిగాయి. అయితే అవి ప్రజాకర్షణకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యవసాయం, విద్య, వైద్యం ఇత్యాది కీలక రంగాలకు స్పష్టమైన కేటాయింపులు ప్రకటించలేదు. విధాన నిర్ణయాలు కొన్నైనా లేవు. గత ఏ బడ్జెట్‌లోనూ లేనన్ని తాయిలాలతో రైతులు, సగటు ఉద్యోగులు, దిగువ మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం బాగా జరిగింది. ఆదాయ పన్ను పరిమితి విషయంలో ప్రతి ఏటా నిరాశ మిగిల్చిన ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. ఊహించిన విధంగానే రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగంలోని వారికి పింఛను వచ్చింది. ఇదంతా ఓట్లు కొల్లగొట్టే సాధనంగా భావించి ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. మొత్తంగా ఎన్‌ఇనకల బండిని పట్టాలకు ఎక్కించారు. ఎందుకు మోడీ బండిలో ఎక్కుతారు…అన్నది రానున్న ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు.