ఎన్నికల వేళే మీకు నేతాజీ గుర్తుకొస్తాడు
– మేము ప్రతీయేటా జయంతి జరుపుకుంటాం
– పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
కోల్‌కతా,జనవరి 23(జనంసాక్షి):
నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను ఎందుకు రద్దు చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారికి నేతాజీ గుర్తొస్తారని దుయ్యబట్టారు. సువిశాల భారతదేశాన్ని పాలించాలంటే నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని నేడు ఆమె కోల్‌కతాలో 6కిలోవిూటర్ల పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించారు. ”బ్రిటిష్‌వారు కోల్‌కతా నుంచే యావత్ దేశాన్ని పాలించారు. ఎందుకు ఇప్పుడు ఒకే రాజధాని ఉంది? సువిశాల భారత దేశానికి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిశల్లో నాలుగు రాజధానులు ఎందుకు ఉండకూడదు? రొటేషన్ పద్ధతిలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇకనైనా మన ఆలోచనాధోరణి మారాలి. ఒకే నాయకుడు.. ఒకే దేశం విధానం వద్దు. పార్లమెంట్‌లో ఎంపీలంతా నాలుగు రాజధానుల డిమాండ్‌ను లేవనెత్తాలి” అని దీదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నేతాజీ పోర్ట్ పేరును శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ డాక్‌గా మార్చడంపై మమత విమర్శలు కురిపించారు.నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించినప్పుడు కనీసం తనను సంప్రదించలేదని దీదీ ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో నేతాజీ జయంతికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అటు ప్రధాని మోదీ కూడా నేడు కోల్‌కతా చేరుకున్నారు. ఇక్కడ జరిగే నేతాజీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.