ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కౌలు రైతులకు కూడా ఆ పథకం అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రైతులకు రుణాలు అందించి వడ్డీని సైతం తక్షణమే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో విఫలం చెందిందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలతో ఎవరికీ లబ్ధి చేకూరలేదన్నారు. చట్టాలను సవరణ చేయడంతో కార్మికులకు కష్టకాలంగా మారనుందన్నారు. రైతులకు రుణ మాఫీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదని, విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ కార్పొరేట్‌ శక్తులకు మోడీ వత్తాసు పలుకుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో రైతులను కల్చి చంపడం దారుణమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసమే పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక హావిూలిచ్చిన ముఖ్యమంత్రి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నాలుగో విడత రుణమాఫీ నిధులు సైతం ఇప్పటికీ బ్యాంకులకు జమ కాలేదని తెలిపారు.