ఎన్‌కౌంటర్‌లపై కవిత విచారం
వరంగల్,సెప్టెంబర్30(జనంసాక్షి): వరంగల్ ఎన్‌కౌంటర్‌పై తొలిసారిగా అధికారపార్టీ పెదవి విప్పింది. ఈ ఎన్‌కౌంటర్ జరగడం దురదృష్టకరమని టిఆర్‌ఎస్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, సిఎం కెసిఆర్ తనయ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రుతి ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడిస్తానన్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఇటీవల ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి నిరసనగా చలో హైదరాబాద్‌కు పిలుపినిచ్చిన వేళ ఇది బాధాకరమని కవిత అనడం విశేషం. వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఎన్‌కౌంటర్ విషయంపై సీఎం కేసీఆర్ తో చర్చిస్తానన్నారు. అలాగే రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాలు పట్టుకుని తిరిగితే సమస్యలు తీరవన్నారు. ఇక ఎర్రజెండా పార్టీలు తోకపార్టీలని, ఆంధ్రప్రదేశ్‌లో వారికి సమస్యలు కనబడడం లేవా అని ఆమె ప్రశ్నించారు. అక్కడ ఆందోళనలు నిర్వహించకుండా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో జైలుకు వెళ్లిన వ్యక్తులకే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. తెదేపా పదవుల్లో చోటు లేదనే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి ఘటనను చేయించారని ఆరోపించారు. పర్యటన సందర్భంగా ఎంపీ హరితహారం కార్యక్రమంలో భాగంగా ధర్నసాగర్‌లో మొక్కలు నాటారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీది కార్పొరేట్ ప్రభుత్వమని విమర్శించారు. పసుపు రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. త్వరలో జరుగబోయే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు.