ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వండి
మహానాడులో తీర్మానం
హైదరాబాద్,మే28(జనంసాక్షి): రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అదినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ గండిపేటలో రెండో రోజు టిడిపి మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహానాడులో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో వ్లిపవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 1983లో ఆహారభద్రతను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని కొనియాడారు. వ్యవసాయరంగంలో విప్లవం తీసుకువచ్చారని, ఎన్టీఆర్ పరిపాలన సంక్షేమానికి మారు పేరు అని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసేతర పార్టీలను ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. రాయలసీమలో కరువు వస్తే జోలె పట్టి డబ్బు వసూలు చేశారని గుర్తు చేశారు. తెలుగువారికి ఎప్పుడు కష్టమొచ్చినా ఎన్టీఆర్ ముందున్నారన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చంద్రబాబు చెప్పారు. కష్టపడటం ఎలాగో ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త అర్ధమిచ్చిన ప్రజానాయకుడని అన్నారు. న్టీఆర్ ప్రతి పని పేదవాళ్ల కోసమే చేశారని గుర్తుచేశారు. ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిందని ఎన్టీఆరే అని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయించామని వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును కొనసాగించినట్లు చెప్పారు. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడమే నా సిద్ధాంతమని ఎన్ టిఆర్ చెప్పారని’ తెలిపారు. భూస్వాములు, పెత్తందార్ల పట్ల ఎన్ టిఆర్ కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఎన్ టిఆర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆచరణకు అనుకూలంగా ఉంటాయన్నారు. ‘సమాజమే దేవాయలయం.. పేదవాడే నా దేవుడు’ అని ఎన్ టిఆర్ చెప్పారని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ, స్ఫూర్తి ప్రధాత ఎన్ టిఆర్ అని కొనియాడారు. ఎన్ టిఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ చీర, ధోవతి కార్యక్రమానికి రూ.400 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. చేనేత కార్మికులకు ఉపయోగపడేలా ఎన్టీఆర్ చీర, ధోవతి కార్యక్రమం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరఘాట్ వద్ద శ్రీకృష్ణుడు వేషంలో ఉండే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంతకు ముందు ఎన్టీఆర్ 92వ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, సినీనటుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టిడిపి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్ అమర్ రహే… చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్లలె రఘునాథరెడ్డి, బి.గోపాల కృష్ణారెడ్డి, రావెల కిశోర్‌బాబు, తెలంగాణ తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ… తెలుగుజాతి ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ ఆశించారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని, కలిసికట్టుగా లక్ష్యాలను సాధించుకోవాలని హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. వీరితో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు అని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నటుడికి వైవీఎస్ చౌదరి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైవీఎస్ మాట్లాడుతూ… రిక్షావాడి నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, విదేశీ శాస్త్రవేత్తల వరకు అందరికీ
ఎన్టీఆర్ జీవితం ఆదర్శమన్నారు. హైందవ సంప్రదాయంలో భాగమైన రామాయణ, మహాభారతం, భాగవతంలోని వివిధ పాత్రలకు జీవం పోసిన మహానటుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా తెలుగు ప్రజలందరూ కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు వివిధ పార్టీల నేతలు కృషి చేయాలని వైవీఎస్ ఈ సందర్భంగా కోరారు.
మహానాడు వేదికపై మనవడి పేరు ప్రకటన
మహానాడు వేదికపై చంద్రబాబు స్వయంగా తన మనవడి పేరు ప్రకటించారు. లోకేశ్, బ్రహ్మణి తనయుడికి దేవాంశ్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. మహానాడు వేదికపై కార్యకర్తల సమక్షంలో మనవడి పేరు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తనకుటుంబంలో ఇప్పుడు ఐదోవ్యక్తి వచ్చాడని అన్నారు. ఉగాది పండగరోజు పుట్టగా ఎన్టీఆర్ జన్మదినం రోజు ప్రకటిస్తున్నాని అన్నారు. తన కుటుంబం తెలుగుదేశం కనుక కటుంబ సభ్యులకు తెలియాలని, ట్విట్టర్ ద్వారా తెలుసుకోవడం కంటే తానే చెబితే బాగుంటుందని చెప్పానన్నారు.