ఎన్‌డీఏలోకి నితీష్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఎన్డీఏ కూటమిలో బీహార్‌ సిఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ చేరడానికి రంగం సిద్దమైంది. పాట్నాలో జరిగే సమావేశంలో నితీశ్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బిజెపి మద్దతుతో బీహార్ల్‌ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా నితీశ్‌కు ఆహ్వానం అందించారు. ప్రధాని మోదీతో బీహార్‌ సీఎం నితీశ్‌ కలిసిన తర్వాత ఈ ఆహ్వానం అందింది. నితీశ్‌తో మాట్లాడిన తర్వాత ఆయనకు ఆహ్వానం అందించినట్లు షా తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అంశాన్ని పాట్నాలో జరిగే సమావేశంలో జేడీయూ ప్రకటించే అవకాశాలున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌ పార్టీలకు జూలై 26న గుడ్‌బై చెప్పిన నితీశ్‌ ఆ తర్వాత బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ తరపున మొత్తం 12 మంది పార్లమెంట్‌ సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఇద్దరు, రాజ్యసభలో పది మంది ఉన్నారు. ఇది బిజెపికి కలసివచ్చే అంశం కానుంది. ఇదిలావుంటే బిహార్‌లో మహాకూటమిని విచ్ఛిన్నం చేసిన నితీశ్‌ కుమార్‌.. భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఆరోపించారు. విపక్ష పార్టీల నుంచి అధికార జేడీయూలో కొంతమంది చేరనున్నారనే ఊహాగానాలను ఈ సందర్భంగా ఆయన కొట్టిపడేశారు. ప్రజాస్వామ్య విలువలు, సూత్రాలకు విరుద్ధంగా మహాకూటమి నుంచి బయటకు వెళ్లి భాజపాతో కలవడం దారుణమని వ్యాఖ్యానించారు. బిహార్‌ రాష్ట్రం అంటే విలువలతో కూడుకున్నదని, త్వరలోనే ప్రజలు నితీశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయానికి తగిన సమాధానం చెబుతారన్నారు. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్డీఏకు వ్యతిరేకంగా పోటీ చేశాయన్నారు. ప్రజలు అధికారం కట్టబెట్టారని, అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ భాజపాతోనే నితీశ్‌ కలవడం దారుణమన్నారు. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి జేడీయూ మహాకూటమిగా ఏర్పడి విజయం సాధించింది. కూటమి తరఫున ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అధికారం చేపట్టారు. జులై 26న మహాకూటమి నుంచి బయటకు వచ్చేసి నితీశ్‌ రాజీనామా చేశారు. మరుసటి రోజునే భాజపాతో పొత్తు పెట్టుకుని మరోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.