ఎపిలో బిజెపి కొత్త పాచిక

టిడిపి దెబ్బతింటే లాభమన్న రీతిలో వ్యూహం
పార్టీలో లుకలుకలతో తెలంగాణలో ఎదురీత
విజయవాడ,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిలో బలపడాలన్న కాంక్ష నెరవేరడం లేదు. ఉన్న కర్ణాటకలో కూడా అధికారం తుడిచిపెట్టుకుపోయింది.   నాలుగు దక్షిణాది రాష్టాల్లో బీజేపీ బలం అంతంతమాత్రమే. దీంతో ఏపీ,తెలంగాణ రాష్టాల్ల్రో రాజకీయంగా బలం కూడా అంతంతమాత్రంగానే ఉంది.  దీనికితోడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కడానికి బీఆర్‌ఎస్‌ పార్టీతో బీజేపీ లాలూచీ రాజకీయాలు నడుపుతోందని ప్రచారం ఉంది. ఏపీలో కూడా అధికార, ప్రతిపక్షాలను దెబ్బతీసి పాతుకు  పోవాలని చూస్తోంది.  వైసీపీ, టీడీపీలను కాదని బీజేపీకి అధికారం అప్పగించడం కాదుకదా..ఒక్కసీటయినా గెలిపిస్తారా అన్నది అనుమానమే. అయితే ఎపి విభజన తీరుపై ఎపికి అనుకూలంగా ప్రధాని మాట్లాడుతున్న తీరు ఏపీలో సానుభూతిని పొందేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎపిలో అధికారంలోకి రావాలనే దీర్ఘకాలపు వ్యూహాన్ని అమలు చేస్తోంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అర్బన్‌ ఓటర్లు, విద్యావంతులతో పాటు, సామాన్య హిందూ ఓటర్లులో  బలంగా నిలిచేందుకు ప్రణాళిక రచిస్తోంది.  ఇప్పటికి బీజేపీ చాలా చిన్నపార్టీగానే గుర్తించాలి.  అద్వానీ రథయాత్ర కారణంగా బీజేపీ పూర్తిస్థాయి హిందుత్వ పార్టీగా ఎదిగినా తెలంగాణ,ఎపిల్లో మాత్రం సత్తా చాటలేకపోతోంది. సాంప్రదాయక కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో నిర్మితమైన వైసీసీని దెబ్బతీసి పరోక్షంగా టీడీపీని బలహీనపరచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో కనుమరుగు చేయగలగితే దీర్ఘకాలంలో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. జగన్‌ను జైల్లో పెట్టి మూయించేస్తే వైసీపీ సాలిడ్‌ ఓట్‌బ్యాంక్‌ అయిన దళితులు, దళిత కైస్త్రవులు, ముస్లింలు కాంగ్రెస్‌ గూటికి చేరతారు తప్ప బీజేపీ వైపు రారు. టీడీపీలో రాజకీయ శూన్యత సృష్టించగలిగితే ఆ పార్టీ మద్దతుదార్లు, కార్యకర్తలు  బీజేపీలో చేరిపోతాయనేది కమలం
పెద్దల అంచనాగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ తనయ పురంధేశ్వరిని అధ్యక్షురాలుని చేయడంలోనూ మాస్టర్‌ ప్లాన్‌ ఉందని అనిపిస్తోంది. టిడిపి దెబ్బతింటే వారంతా ఇటు బిజెపిలో చేరుతారన్న ఆలోచన కావచ్చు. అందుకే పురందేశ్వరి ద్వారా బిజెపి రాజకీయాలు నడిపిస్తోంది. అనూహ్యంగా ఇప్పుడు టిడిపి నేత చంద్రబాబు కేసుల్లో అరెస్ట్‌ కావడంతో దానిని క్యాష్‌ చేసుకునే యోచనలో ఉంది. టీడీపీ బలహీనపడితే తమకు లాభిస్తుందన్న యోచనలో ఆ పార్టీ ఉంది. ఇకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమంటూ జాతీయ, రాష్ట్ర నాయకులు కుండబద్దలు కొడుతున్నా, కొద్ది రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం కేడర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీనియర్‌ నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అవుతుండడంతో.. ఇది ఎక్కడకు దారితీస్తుందోనని వారిలో బెంగ పట్టుకుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన యెన్నెం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్‌ వ్యవహారం కూడా పార్టీ కేడర్‌లో చర్చనీయాంశమైంది. వేటు అనంతరం వీరు బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేశారు. వాటిని నాయకత్వం తిప్పికొట్టలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.. తాజాగా సోషల్‌ విూడియాలో పెట్టిన పోస్టు మాత్రం మరింత చర్చనీయాంశమైంది. తమ తీరును తప్పుబడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వైఖరిని విమర్శిస్తూ ఇటీవల కొందరు సీనియర్లు నిర్వహించిన రహస్య భేటీపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం పక్కనబెడితే ఉన్నవారిని బీజేపీ కాపాడుకోలేక పోతోందనే వాదనకు బలం చేకూరుస్తూ ఎన్నికల వేళ ఆ పార్టీకి మరో షాక్‌ తగలనుంది. అధికార ప్రతినిధి, మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీతో కలిసి ఆయన ఢల్లీి వెళ్లారు. కాంగ్రెస్‌ పెద్దలను కలిసేందుకే వీరేందర్‌ వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు.