ఎఫ్‌డీఐలపై అనుమతులను వెనక్కి తీసుకొండి : సుష్మా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఎఫ్‌డీఐ బిల్లును లోక్‌సభలో ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం భారత వ్యాపార విఫణిలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులరాలు, బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్‌ విమర్శించారు. ఈ అనుమతులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ బిల్లును బీజేపీయే కాదు యూపీఏ మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు, తృణమూల్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆమె తెలియజేశారు.

ప్రభుత్వం మాట తప్పింది

కేంద్ర సర్కార్‌ సభలో ఇచ్చిన మాటను తప్పిందని, ఏకాభిప్రాయం సాధించే వరకు ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోబోమన చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏకాభిప్రాయం సాధించకుండానే నిర్ణయం తీసుకుందని ఆమె దుయ్యబట్టారు. ఎఫ్‌డీఐల వల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా నష్టపోతారని ఆమె ధ్వజమెత్తారు, ఫెమా, ఎఫ్‌డీఐలపై ఒకే సారి చర్చజరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీతో పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి, ఫెమా సవరణలపై ప్రత్యేకంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి, ఫెమాపై చర్చను వాయిదా వేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశాయి.

కాంగ్రెస్‌పై సుష్మా ఫైర్‌

బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు ఓటింగ్‌కు బయపడి పారిపోతున్నాయని కేంద్ర మంత్రి కమల్‌ నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్‌ ఫైర్‌ అయ్యారు. అసలు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు పట్టుబట్టింది. డిమాండ్‌ చేసిందే తమ పార్టీ అని ఆమె తెలియజేశారు. కాగా, ఓటింగ్‌ పెడితే ఎవరేంటో తేలిపోతది గదా అని యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. మరో ప్రతిపక్షనేత గురుదాస్‌ గుప్తా తాము ఓటింగ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు.

స్పీకర్‌కు కృతజ్ఞతలు: సుష్మా

ఎఫ్‌డీఐలపై 14వ నిబంధన కింద చర్చకు అనుమతించినందుకు స్పీకర్‌ మీరాకుమార్‌కు సుష్మా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిబంధన కింద చర్చ వలన ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె వివరించారు.