ఎఫ్‌సీఐ పునరుద్దరణకు సహకరిస్తాం
అధికారులతో సమీక్ష
సీఎంతో సింగరేణి సీఎండి భేటి
హైదరాబాద్,జనవరి18(జనంసాక్షి):
కరీంనగర్ జిల్లా ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) పునరుద్దరణకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనివల్ల ఇక్కడ రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ సీఎండీ మనోజ్ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ఎల్ సీఈవో వివేక్ మల్హోత్రాలు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఎఫ్‌సీఐ పునరుద్దరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని వెల్లడించారు. దీనిని పునరుద్దరించేందుకు తీసుకునే చర్యలకు సహకరిస్తామని అన్నారు. ఇదిలావుంటే సీఎం కెసిఆర్‌ను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధరన్ కలిశారు. 2014-15 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ గడించిన లాభాలకు సంబంధించి డివిడెండ్ రూ.66.42 కోట్ల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సింగరేణి సంస్థను అభినందించారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం అభినందనీయ మన్నారు. సింగరేణి సీఎండీ, ఇతర ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సింగరేణి కార్యకలాపాలపై సవిూక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.490 కోట్లు లాభాలు పొందిందని తెలిపారు. 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.66.42 కోట్లు, కేంద్రానికి 49 శాతం వాటాగా రూ.63.58 కోట్లు లభిస్తాయని వివరించారు. లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా సింగరేణి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర చోట్ల కూడా గనుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఇకపోతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల సవిూకరణే లక్ష్యంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు. కేసీఆర్ ముందుగా హైదరాబాద్ నుంచి ఇండోర్ వెళ్లతారు. ఆధునిక ఇరిగేషన్ పద్ధతులపై కేసీఆర్ మధ్యప్రదేశ్ సర్కార్ తో చర్చలు జరిపిన అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.