ఎమ్మెల్యేగా ఏం చేశారని వచ్చారు

వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
చిత్తూరు,మార్చి26(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలో వైసిపి ఎంఎల్‌ఎ కు చేదు అనుభవం ఎదురయ్యింది. జీడి నెల్లూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నారాయణ స్వామి మంగళవారం ఉదయం పెద్ద దామరకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. పెద్ద దామరకుంట గ్రామస్తులు ఎంఎల్‌ఎ ను నిలదీశారు. అయిదేళ్లు ఎంఎల్‌ఎ గా ఉండి ఊరికి ఒక్క పని కూడా చేయకుండా ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారంటూ.. పెద్ద దామరకుంట గ్రామస్తులు నారాయణ స్వామిని నిలదీశారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తమ చేత ఓట్లేయించుకొని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ.. గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తిరిగి ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారు అని కొందరు మహిళలు నారాయణతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామస్తులను సముదాయించేందుకు నారాయణ స్వామి నానా తంటాలు పడ్డారు. పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల తాను ఏవిూ చేయలేకపోయానని, ఈ సారి తనను గెలిపిస్తే.. గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తానని నారాయణ స్వామి ఓటర్లను వేడుకున్నారు.