ఎమ్మెల్యేల దూకుడుతో కాంగ్రెస్‌కు నష్టమే
లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపడం ఖాయం
హైదరాబాద్,మార్చి19(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ¬దాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సబ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల రేపటి ఎన్నికల్లో ప్రభావం తప్పకుండా పడుతుంది. ప్రజలు కూడా టిఆర్‌ఎస్‌కు మద్దతు పెరుగుతందన్న ఆలోచనలో పడతారు. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలం అయ్యిందనే అంటారు. ఇకపోతే అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోవడం వల్ల ప్రశ్నించే గొంతుక లేకుండా పోయింది. ఎంఐఎం ఉన్నా అది టిఆర్‌ఎస్ మిత్రపక్షంగానే ఉంటుంది. బిజెపికి ఒకేఒక వాసనసభ్యుడు ఉన్నాడు. మొత్తంగా శాసనసభ మొత్తం గులాబీమయం అయినట్లే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయా లేక ఎమ్మెల్యేలు అధికార ముద్ర వేయించుకోవాలనుకున్నారా అన్నది పక్కన పెడితే అసెంబ్లీలో అధికార పార్టీని అడిగే సభ్యులు లేరనే చెప్పాలి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ 19 సీట్లను గెల్చుకుంది. టిడిపి 2 సీట్లను గెల్చుకుంది. అయితే కాంగ్రెస్ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకునే కార్యక్రమం ఊపందుకుంది. ఇప్పటికే 88మంది ఉన్న టిఆర్‌ఎస్ బలం మెల్లగా సెంచరీ దిశగా సాగుతోంది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులెవ్వరూ ఉండకూడదని అనుకోవడం సమర్థనీయం కాదని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చినందున సుస్థిర ప్రభుత్వం కోసం ప్రతిపక్షాల సభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే అవకావం లేదు. ఎందుకంటే తాజా ఎన్నికలలో కేసీఆర్‌కు తిరుగులేని మెజారిటీ వచ్చింది. అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సమర్థనీయం ఎలా అవుతుంది. తెలంగాణలో మరో పార్టీ బతికి బట్టకట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. శాసనమండలిలో కాంగ్రెస్‌కు చోటులేకుండా చేసిన కేసీఆర్.. శాసనసభలో కూడా కాంగ్రెస్‌కు చోటులేకుండా చేయాలనుకుంటున్నారని ఉత్తమ్, భట్టి తదితరులు విమర్శలుచేశారు.