ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కన్నుమూత
హైదరాబాద్,ఆగస్ట్25(జనంసాక్షి):
కాంగ్రెస్ సీనియర్ నేత, మెదక్‌జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల సంఘం చైర్మన్ కిష్టారెడ్డి(67) హఠాన్మరణం చెందారు. ఆయననిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌లోని తన నివాసంలో నిద్రలో గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలేవకపోవడంతో మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే కిష్టారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో మృతిచెందినట్లుగా సమాచారం. నారాయణఖేడ్ నుంచి కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు నలుగురు కుమారులు, భార్య ఉన్నారు. పెద్ద కుమారుడు సంజీవరెడ్డి ప్రస్తుతం నారాయణఖేడ్ ఎంపీపీగా ఉన్నారు. కిష్టారెడ్డి భౌతికకాయాన్ని మధ్యాహ్నం నారాయణఖేడ్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిష్టారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ రెండుసార్లు పీఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణ్‌ఖేడ్ నుంచి మూడోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్లు పంచగామ సర్పంచిగా పనిచేశారు. ఐదేళ్లు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. కిష్టారెడ్డి స్వస్థలం నారాయణ్‌ఖేడ్ మండలం పంచగామ. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో కిష్టారెడ్డి భౌతికకాయానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిష్టారెడ్డి ప్రజల మనిషి అని కొనియాడారు. మెదక్ జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు కిష్టారెడ్డి ఎంతో సేవ చేశారని తెలిపారు. కిష్టారెడ్డి తమకు ఎల్లప్పుడూ సలహాలు, సూచనలు చేస్తూ ఉండేవారని గుర్తు చేశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని లోటు అని వ్యాఖ్యానించారు. విూడియాతో మాట్లాడుతూ సునీత కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర ఉద్వేగానికి లోనవుతూ.. రాజకీయాల్లో తనకు తండ్రిలా వెన్నంటి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గొప్ప నాయకుడిని తాము కోల్పోవడం బాధగా ఉందని తెలిపారు. కిష్టారెడ్డికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. ఇదిలావుంటే కిమ్స్ ఆస్పత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పటోళ్ల సేవలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. కిష్టారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, స్పీకర్ మధుసూదానాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. ఆయన వివాదరహితుడిగా పేరుగాంచి జిల్లా అభివృద్దికి ఎంతగానో కృషి చేశారని మాజీమంత్రి గీతారెడ్డి అన్నారు. కిమ్స్‌లో ఎమ్మెల్యే కిష్టారెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి గీతారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. కిష్టారెడ్డి రాజకీయాల్లో తనకు తండ్రిలాగా సహకరించే వారు అని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని కంటతడి పెట్టారు. కిష్టారెడ్డి భౌతికకాయానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిష్టారెడ్డి మృదుస్వభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతి మెదక్ జిల్లాకు తీరని లోటు అని ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తనను కిష్టారెడ్డి బాగా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆయన ఎప్పుడూ విలువైన సూచనలు సలహాలు ఇస్తుండేవారని మంత్రి తలసాని అన్నారు.