ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి


– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
– కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం
– ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
– గాయపడ్డ పలువురి కార్యకర్తలను ఆస్పత్రికి తరలింపు
ఖమ్మం, మే4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో హరిప్రియ పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు..
ఆమెపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో గోవింద్రాల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి లాకవర్తు సునితకు మద్దతుగా ఎమ్మెల్యే హరిప్రియ ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహించారు. అంతేకాకుండా ఆమెపై చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ పరిణామాలతో ఆగ్రహానికి గురైన తెరాస కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ శ్రేణులపై దాడికి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనతో హరిప్రియ తన ప్రచారాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలిచిన హరిప్రియను కష్టపడి గెలిపించామని, ఆమె ఇష్టానుసారంగా పార్టీ మారడం ఏమిటని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నించారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ  ఇరువర్గాల కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని అదుపుచేయడం కష్టతరంగా మారింది. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను స్థానిక ఎస్సై తిరుపతిరెడ్డి సవిూక్షిస్తున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా దాడిలో గాయపడ్డ ఇరు పార్టీల కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కాగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ గ్రామంలో పరిస్థితిపై సవిూక్షించారు.