ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు

1

 

1A
ఆరు స్థానాలకు ఏడు

తప్పని పోటీ

హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసవత్తర పోటీకి దారితీస్తోంది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. దీంతో టిడిపికి గెలచే ఛాన్స్‌ లేకుండా టిఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. నామినేషన్ల ఘట్టం ముగిసినా ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు  స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టిఆర్‌ఎస్‌ నుంచి మండలి అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లుతో పాటు అదనపు అభ్యర్థిగా యాదవరెడ్డిని తెరాస పోటీలోకి దించింది. టిడిపి మండలి అభ్యర్థిగా  వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డికి 16మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. 11మంది టిడిపి సభ్యులు సహా ఐదుగురు బిజెపి  సభ్యులు నరేందర్‌రెడ్డికి మద్దతుగా సంతకాలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఆకుల లలిత నామినేషన్‌ వేశారు. అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ అనివార్యం కానుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యులను బరిలోకి దింపింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలతో పాటు యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్లు టీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నివాళులర్పించారు. మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి, మమేందర్‌ రెడ్డిలు తోడు రాగా అభ్యర్థులు ముందుగా గన్‌పార్క్‌ వద్ద నివాళులు అర్పించారు. ఐదో అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై చివరి నిమిషం వరకు టీఆర్‌ఎస్‌ తర్జనబర్జన పడింది. టీడీపీ- బీజేపీ కూటమి తరపున బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించే పక్షంలో ఐదో స్థానానికి పోటీ చేయకూడదని టీఆర్‌ఎస్‌ భావించింది. అయితే టీడీపీ నుంచి వేంనరేందర్‌రెడ్డి పేరును ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ ఐదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపింది. అయితే తమకున్న సంఖ్య మేరకు తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరావు దీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. దీంతో వైకాపా, సిపిఐ, సిపిఎం అభ్యర్థులు ఎటు ఓటు వేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ చూపాలని బీజేపీ నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఆయా పార్టీలకు ఉన్న బలాల మేరకు ఏకగ్రీవం అయ్యే అవకాశముందని చెప్పారు. ఇదిలావుంటే  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఐదో అభ్యర్ధిని పోటీలో పెట్టడంపై కాంగ్రెస్‌ విమర్శించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ఉద్దేశంతో ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అవకాశం ఇచ్చామన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని విమర్శించారు. ‘అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు  22 మంది ఉన్నారు, వారంతా మా పార్టీకే ఓటేస్తారు. క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా సుప్రింకోర్టు నుంచి డైరెక్షన్స్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము’ అని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు.గెలుస్తామనే ధీమాతోనే తాము ఐదో అభ్యర్థిని బరిలోకి దించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఇతర పార్టీలు తమకు ఓటు వేసే అవకాశం ఉందని, బేరసారాలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సిఎం కెసిఆర్‌ చేపడుతున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీలకు చెందిన వారు ఓటేసే అవకాశం ఉందన్నారు. అందుకే తాము ఐదో అభ్యర్థిని దింపామని అన్నారు. తమకు పూర్తి మద్దతు ఉందని సంఖ్యాబలం మేరకే తానునామినేసన్‌ వేశానని టిడిపి అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి అన్నారు. మొత్తానికి జూన్‌ 1న జరిగే పోలింగ్‌ కీలకం కానుంది. శుక్రావరం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 26 చివరితేదీ. 1న ఎన్నిక జరిపి అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర అసెంబ్లీలో 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతోన్న ఎన్నికల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో ప్రతీ అభ్యర్థికి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాం/-గరెస్‌ ఒకస్థానాన్ని గెల్చుకునే అవకాశం ఉంది. టిడిపి,బిజెపి కలిసి ఒక స్థానాన్ని గెల్చుకునే అవకాశం ఉన్నా కొందరు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో  వారి గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉండడంతో ఆ పార్టీ మహిళ అభ్యర్థి ఆకుల లలితను అధికారికంగా ప్రకటించింది.  టిఆర్‌ఎస్‌ ఆరో అభ్యర్థిరి రంగంలోకి దింపే ఆలోచన చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారనుంది.