ఎమ్మెల్సీ రాములునాయక్‌పై వేటు 

– సస్పెండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం
హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై ఆపార్టీ అధిష్టానం వేటు వేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాములు నాయక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్నందుకే రాముల్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది.
కాగా.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ ఖుంటియాతో రాములు నాయక్‌ భేటీ అయ్యారని ఆదివారం జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ నుంచి నారాయణఖేడ్‌ టికెట్‌ను రాములు నాయక్‌ ఆశించారు. కానీ ఆ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు నారాయణఖేడ్‌ నుంచి రాములు నాయక్‌కు అవకాశం కల్పించాలని పలు గిరిజన సంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ¬టల్‌లో ఖుంతియాను రాములు నాయక్‌ కలిశారని జోరుగా ప్రచారం సాగింది. దీనికితోడు రాములు నాయక్‌ రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ తీర్థంపుచ్చుకుంటారని ప్రచారం సాగింది. దీంతో పూర్తి వివరాలను సేకరించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. రాముల్‌ నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ తెలిపారని అన్నారు.