ఎమ్యెల్యే రాజాసింగ్ పై ఫిర్యాదు…
– కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్….
బూర్గంపహాడ్ ఆగష్ట్ 24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ముస్లిం మైనార్టీల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ మహ్మద్ ప్రవక్తపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వీడియో విడుదల చేయడం శోచనీయమని పేర్కొంటూ ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని బుధవారం బూర్గంపహాడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసింగ్ చర్య ముస్లిం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. రాజాసింగ్ మీరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, మీరు రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలు అజ్ఞానులు కారని, మీ గురించి తెలియనంత అమాయకులు కారన్నారు. ముఖ్యంగా మీ పార్టీ వాళ్లే మీ గురించి తెలిసే పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఇకనైనా బుద్ధితెచ్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖదీర్, పాష, ముంతాజ్, (బాని) యాకుబ్ పాషా, మున్నా, షాబజ్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.