ఎయిమ్స్‌ నుంచి లాలూ డిశ్చార్జ్‌-

– అన్యాయమని ఆక్రోశించిన లాలూ
– ఈ కఠిన సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి
న్యూఢిల్లీ, జ‌నం సాక్షి ) : అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లూగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స
పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ డిశ్చార్జ్‌ కానని ఆయన చెప్పినా ఎయిమ్స్‌ డాక్టర్లు మాత్రం వినలేదు. రాంచీలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ఆయనకు సూచించారు. తన అనారోగ్యాన్ని బాగు చేసే అత్యాధునిక వసతులు రాంచీ హాస్పిటల్‌లో లేవని, తాను అక్కడికి వెళ్లనని లాలూ ఎయిమ్స్‌కు లేఖ రాశారు. అయినా ఆసుపత్రి మాత్రం ఆయన వినతిని పట్టించుకోలేదు.
చికిత్స పూర్తికాకుండానే డిశ్చార్జ్‌ చేశారు – లాలూ
ఎయిమ్స్‌ వైద్యులు డిశ్చార్చ్‌ చేయడంతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాంచీ జైలుకు బయలుదేరారు. అయితే తనను బలవంతంగానే డిశ్చార్చ్‌ చేశారని లాలూ ప్రసాద్‌ విూడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ‘ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. ఎలాంటి సౌకర్యాలు లేని చోటకు నన్ను షిఫ్ట్‌ చేస్తున్నారు. ఇది చాలా గడ్డు సమయం. అయినా సరే పరిస్థితిని ఎదుర్కొంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాలూ డిశ్చార్చ్‌ సందర్భంగా పెద్దఎత్తున ఆర్జేడీ అభిమానులు, విూడియా అక్కడకు చేరుకోవడంతో వారిని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయనకు ప్రయాణించే సత్తువ ఉందని ఎయిమ్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయనను రాంచీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. లాలూ డిశ్చార్చ్‌ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న వాదననలను సైతం ఎయిమ్స్‌ వైద్యులు తోసిపుచ్చారు. మెడికల్‌ బోర్డు సలహా విూదే లాలూను డిశ్చార్చ్‌ చేశామని పేర్కొంది. మరోవైపు లాలూని బలవంతంగా ఎయిమ్స్‌ నుంచి పంపించేయడంపై ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాణా కేసులో దోషిగా తేలిన లాలూ గతేడాది డిసెంబర్‌ 23 నుంచి రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉంటున్నారు. అయితే మార్చి 17న తనకు అస్వస్తతగా ఉందని చెప్పడంతో స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మార్చి 29న ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. లాలూని చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఇంతకుముందే ఆయన భార్య రబ్రీ దేవి ఆరోపించిన విషయం తెలిసిందే. తన భర్త ఆరోగ్యం క్షీణిస్తున్నదని, అది అనారోగ్యం వల్లో లేక ఇచ్చే మందుల వల్లో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
తొందరపాటు నిర్ణయం – లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదటపడక ముందే, ఆయన ఇష్టం లేకున్నా న్యూఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి జార్ఖండ్‌ ఆస్పత్రికి ఎందుకు తరలించాలని నిర్ణయించుకున్నారని తేజస్వీ ప్రశ్నించారు. పట్నాలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌ వైద్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎయిమ్స్‌ నుంచి లాలూను ఎందుకు డిశ్ఛార్జ్‌ చేయాలనుకున్నారో సంబంధిత అధికారులు కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌ హాస్పిటల్‌తో పోల్చితే ఎయిమ్స్‌ బెస్ట్‌ హాస్పిటల్‌ అని తన తండ్రి లాలూను అక్కడే ఉంచి చికిత్స అందించాలని తేజస్వీ కోరారు.